LTIMindtree Gets Nifty Ticket: దేశంలో ఆరో అతి పెద్ద IT కంపెనీ LTIమైండ్‌ట్రీకి హార్ట్‌బీట్ ఇండెక్స్ నిఫ్టీ50లోకి ఎంట్రీ టిక్కెట్‌ దొరికింది. HDFC బ్యాంక్‌లో HDFC విలీనం తర్వాత ఖాళీ అయ్యే HDFC స్థానాన్ని LTIMindtree రీప్లేస్‌ చేస్తుంది.


NSE సూచీల ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్-కమిటీ (ఈక్విటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. "HDFC స్థానంలోకి LTIMindtree రీప్లేస్‌మెంట్‌ ఈ నెల 13 నుంచి (ఈ నెల 12న ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత) అమలులోకి వస్తుంది" అని NSE తెలిపింది.


బ్రోకింగ్‌ హౌస్ నువామా లెక్కల ప్రకారం, నిఫ్టీ50లోకి LTIMindtree అడుగు పెడితే, ఈ కౌంటర్‌లోకి సుమారు 150-160 మిలియన్‌ డాలర్ల పాసివ్‌ ఫండ్స్ వచ్చి పడతాయి. దీంతోపాటు, హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లోకి ఎంట్రీతో రేంజ్‌ పెరుగుతుంది కాబట్టి, యాక్టివ్‌ ఫండ్స్‌ నుంచీ ఇన్‌ఫ్లో ఉంటుంది. దీనర్ధం, LTIMindtree షేర్లలో మంచి కొనుగోళ్లను చూసే అవకాశం ఉంది, డిమాండ్‌ పెరుగుతుంది. 


ప్రస్తుతానికి, LTIMindtree నిఫ్టీ నెక్స్ట్50 ఇండెక్స్‌లో భాగంగా ఉంది. ఈ ఇండెక్స్‌ను జూనియర్ నిఫ్టీ అని కూడా పిలుస్తారు. నిఫ్టీ50లోకి వెళ్లడానికి నిఫ్టీ నెక్ట్స్‌50 రూమ్‌ను LTIMindtree ఖాళీ చేస్తుంది కాబట్టి, ఈ నెల 13 నుంచి, జిందాల్ స్టీల్ & పవర్ (Jindal Steel & Power) ఆ రూమ్‌ను ఆక్రమించుకుంటుంది.


25 షేర్లకు 42 షేర్లు
HDFC బ్యాంక్‌లో HDFC మెర్జర్‌ ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చింది. జులై 13న, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ HDFC షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి డీలిస్ట్ అవుతాయి. జులై 12న డే క్లోజింగ్‌తో ఆ షేర్లలో ట్రేడింగ్ ముగిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లకు అదే చిట్టచివరి ట్రేడింగ్‌ రోజు. జులై 13 నుంచి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేరుతోనే హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ట్రేడ్‌ అవుతాయి. 


విలీన ఒప్పందం ప్రకారం షేర్ల కేటాయింపు కోసం అర్హులైన షేర్‌హోల్డర్లను నిర్ణయించడానికి ఈ నెల 13ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. అర్హులైన షేర్‌హోల్డర్లకు, హెచ్‌డీఎఫ్‌సీలో హోల్డ్‌ చేస్తున్న ప్రతి 25 షేర్లకు బదులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన 42 షేర్లను పొందుతారు. ఆ షేర్లు డీమ్యాట్‌ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతాయి.


ఈ ఏడాది మే నెల ప్రారంభంలో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన మ్యాన్‌కైండ్ ఫార్మా (Mankind Pharma) కూడా నిఫ్టీ ఇండెక్స్‌ల్లోకి అడుగు పెట్టింది. ఈ స్క్రిప్‌ను నిఫ్టీ500, నిఫ్టీ మిడ్‌ క్యాప్150, నిఫ్టీ మిడ్‌ క్యాప్100, నిఫ్టీ200 సహా మరికొన్ని నిఫ్టీ సూచీల్లో చేర్చారు.


FinNiftyగా పిలిచే 'నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్' నుంచి HDFC వైదొలుగుతుంది. దీని స్థానంలోకి LIC హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance) ప్రవేశిస్తుంది. నిఫ్టీ మిడ్‌ క్యాప్ సెలెక్ట్‌లో జిందాల్ స్టీల్ & పవర్‌ను జైడస్ లైఫ్‌సైన్సెస్ (Zydus Lifesciences)‍‌ భర్తీ చేస్తుంది.


మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' LTIMindtree, Mankind Pharma


Join Us on Telegram: https://t.me/abpdesamofficial  


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.