రావణాసురుడు రాక్షస కుటుంబానికి చెందిన అసుర దంపతులైన విశ్రవసు, కైకేసిల కుమారుడు. అందుకే ఆయన్ని రాక్షసరాజు అని అంటారు. రాక్షసుల కులదైవమయిన శివునికి మహా భక్తుడు. నిరంతరం శివారాధన చేయడం ఆయన ధర్మం. అనేక సార్లు మహా శివుని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకుని గొప్ప వరాలు పొందిన తపస్సంపన్నుడు.
మహా పండితుడు
రావణుడు గొప్ప సంగీత విద్వాంసుడు. వీణావాయిద్యంలో ఆరితేరిన వాడు. మొత్తం షడ్సాస్త్రాలు అవపోసన పట్టిన వాడు. నాలుగు వేదాలు చదువుకున్న చతుర్వేది. 64 కళల్లో ప్రవేశం కలిగిన అత్యంత జ్ఞానవంతుడు. మహా పండితుడైన బ్రాహ్మణుడు. తపస్సశ్శక్తి కలిగిన వాడు. అందువల్లే అతడు రావణ బ్రహ్మగా పేరుగాంచాడు. అతడితో పొరాడి గెలవగలిగే వారు 14 లోకాల్లోనూ ఎవరూలేరని ప్రతీతి. రావణుడు ఎన్నో గ్రంథాలు కూడా రచించాడని చెబుతారు. సామవేదంలోని ఏడు స్వరాలను సంకలనం చేశాడు. ఇప్పటికీ అందరూ పాడుకునే శివతాండవ స్తోత్రాన్ని స్వరపరచింది రావణాసురుడే.
రావణుడికి 10 తలలు ఎలా వచ్చాయి?
ఒకసారి కఠోర శివ దీక్షలో భాగంగా శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు హోమ గుండంలో తన తలను తానే నరికి త్యాగం చేశాడు. అతడి తపశ్శక్తి వల్ల అతడి తల తిరిగి యథా స్థానానికి వచ్చింది. అలా పది సార్లు తన తలను నరికి శివుడి ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. అతడి త్యాగానికి శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. ఆ సందర్భంలో అతడికి పదితలలను, ఇరవై చేతులను ప్రసాదించాడు. అది అతను కోరుకున్నప్పుడల్లా వచ్చేలా వరం ఇచ్చాడు. అందుకే రావణుడు దశముఖుడు, దశకంఠుడు, దశగ్రీవుడు అనే పేర్లతో ప్రసిద్ధికెక్కాడు.
విచిత్ర రామాయణం ద్వారా మరో కథ కూడా ప్రచారంలో ఉంది. వశ్రవసు దాంపత్య సుఖాన్ని ఆశించి కైకసిని చేరిన సందర్భంలో ఆమె అప్పటికే పది సార్లు రుతుమతి అయిందని తెలుసుకుంటాడు. అందుకే ఆమె ద్వారా పదకొండు మంది పుత్రులు కావాలని కోరుకుంటాడు. కానీ కైకసి మాత్రం తనకు ఇద్దరు కుమారులు మాత్రం చాలని అంటుంది. మహా తపస్సంపన్నుడైన విశ్రవసు మాట వృథా కాకూడదు కనుక పది తలలు కలిగిన రావణుడితో పాటు కుంభకర్ణుడిని కుమారులుగా ప్రసాదించాడని మరో కథ.
వాల్మీకీ రామాయణంలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. రావణుడికి తెలిసిన కామరూప విద్య ద్వారా రావణుడు పది తలలను పొందాడని కూడా మరో కథ ఉంటుంది. ఆ ప్రకారం అతడు ఎప్పుడు కోరితే అప్పుడు పది తలలు ఇరవై చేతులు వస్తాయి. ఇలా పది ఇంద్రియాలకు లొంగిపోయిన వాడే దశకంఠుడు అని పురాణ పండితులు విశ్లేషిస్తున్నారు.
10 తలలు దేనికి ప్రతీక?
రావణుడికి ఉన్న పది తలలను రావణాసురుడి తెలివి తేటలు పాండిత్యానికి ప్రతీకగా కొంత మంది విశ్లేషించినప్పటికీ.. నిజానికి పదితలలు అతడి వ్యక్తిత్వానికి ప్రతీకలు. కామం, క్రోదం, లోభం, మోహం. మదము, మాత్సర్యము, అహంకారం, చిత్త, మానస, బుద్ధి వీటన్నింటికీ ప్రతిబింబిస్తాయి. అతడి వ్యక్తిత్వంలో భాగమైన అతడి పూర్తి శక్తి, యుక్తులను అతడి పది తలలు ప్రతీకలుగా చెప్పవచ్చు.
Also read : ఎంతో ప్రేమించిన రాధను కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు?