Gaddar Political Party : రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలని ప్రజాయుద్ధనౌక గద్దర్ నిర్ణయించారు. ఆ పార్టీ...ఈ పార్టీలో చేరాలని కాకుండా.. సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఢిల్లీ వెళ్లారు గద్దర్. ఎన్నికల కమిషన్‌తో భేటీ అయి గద్దర్ ప్రజా పార్టీ పేరును కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. గద్దర్ విప్లవానికి పోరాటానికి ప్రతీక. అందువల్లే "గద్దర్ ప్రజా పార్టీ" జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే జెండా మధ్యలో పిడికిలిని పెట్టారు. ఈ మూడు రంగుల్లో ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులతో రూపొందించారనే ప్రచారం జరుగుతోంది.
గద్దర్ తన ప్రయాణాన్ని ఎరుపురంగుతో ప్రారంభించారు. గద్దర్ మొదటగా అంబేద్కరిస్టు.. కాలానుగుణంగా ఆయన వామపక్ష రాజకీయాలపై ఆకర్షితులయ్యారు. అందుకే నీలి రంగు కూడా జెండాలో తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలపై తరచగా స్పందిస్తున్నారు. ఆ మధ్య వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. స్వరాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, నిరుద్యోగ సమస్య, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల తీరు, ధరణి పోర్టల్ వల్ల ప్రజలు పడుతున్న బాధలను.. ‘నన్ను గన్న తల్లుల్లారా’ అనే బాణిలో వివరిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గద్దర్.. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆయన కాంగ్రెస్ చేరి ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇదిగో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఉద్యమానికి ఆకర్షితులై ఆయన పాటలతో ప్రజల్లోకి వెళ్లారు. బహుజనులను జాగృతం చేసేందుకు ప్రయత్నించారు. పాటలతో ఉద్యమాన్ని రగిలించారు. పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి.. పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్ ఓట్ల రాజకీయాలపై రావాలని నిర్ణయించుకున్నారు.
గద్దర్ చాలా కాలంగా రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో సమావేశం అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు కేఏ పాల్ ను కూడా కలిశారు. ఆయన సమక్షంలోనే .. తన ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ ను అభ్యర్థిగా ప్రకటించారు పాల్. తర్వాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ఇటీవల కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటిస్తారు. ఈ క్రమంలో సొంత పార్టీ పెట్టడంతో ఆ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది.