Andhra Politics  :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి.  ఒకరిని విమర్శిస్తే మరొకరకు రెస్పాండ్ అవుతున్నారు. ఇలా రెస్పాండ్ అయ్యే వారు అదే పార్టీకి చెందిన వారు కాకపోవడం ఇక్కడ అసలు ట్విస్ట్. ద్వారంపూడిని, వైసీపీని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శిస్తే.. వెంటనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లైన్‌లోకి వచ్చారు. అలా ఎలా విమర్శిస్తారని ఓ లేఖ రాసేశారు. ఇలా ముద్రగడ లేఖ రాయగానే.. జనేసన నాయకులు స్పందించలేదు. టీడీపీకి చెందిన బుద్దా వెంకన్న.. బీసీ నేత హోదాలో ప్రశ్నిస్తున్నానని కౌంటర్ ఇచ్చారు.  అసలు ఈ ఎపిసోడ్ లో తర్వాత ఎవరు జోక్యం చేసుకుంటారో కానీ.. ఒకరికొకరికి సంబంధం లేదని ఈ రాకీయం నడుస్తోంది. 


ద్వారంపూడిని  విమర్శిస్తే ముద్రగడకు ఎందుకు ? 
 
తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్నపవన్ కల్యాణ్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం తెరపైకి వచ్చారు. ఆయన వైసీపీలో ఇంకా అధికారికంగా చేరలేదు. కానీ పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ.. ప్రశ్నిస్తూ తెర ముందుకు వచ్చారు.   ద్వారంపూడి దొంగ అయితే రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో చెప్పాలని  పవన్ ను ప్రశ్నించారు.  ద్వారంపూడి మీద పోటీ చేయాలని సవాల్ చేశారు.  ‘‘మీ ప్రసంగాలలో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి, క్రింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి’’ అంటూ ముద్రగడ లేఖలో పవన్ ను ప్రశ్నించారు.  


ముద్రగడకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ 


ముద్రగడ రాసిన లేఖకు.. జనసేన పార్ట నుంచి స్పందన  రాక ముందే తెలుగుదేశం పార్టీకి చెందిన బుద్దా వెంకన్న స్పందించారు. కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీని కాకుండా ఇతర పార్టీలను మాత్రమే ప్రశ్నిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్‌తో లాలూచీ పడ్డారని మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబేనని అయినా మీరుఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. 1994లో  ఓడిపోతే చంద్రబాబు పిలిచి మరీ పార్లమెంట్ సభ్యుడిని చేశారని గుర్తు చేశారు. కాపు ఉద్యమం పేరుతో చంద్రబాబును విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జగన్ కాపులకు ఏం చేశారో ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.  





 


బుద్దా వెంకన్నకు వైసీపీ కౌంటర్ ఇస్తుందా ?


ముద్రగడ పద్మనాభం పవన్ ను విమర్శిస్తూ రాసిన లేఖకు.. టీడీపీ నేత బుద్దా వెంకన్న సమాధానం ఇచ్చారు. మరి బుద్దా వెంకన్నకు వైసీపీ సమాధానం ఇస్తుందా అన్న సందేహం ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. వైసీపీకి సపోర్ట్ గా ముద్రగడ రావడం.. పవన్ ను విమర్శించడం..  ఏమీ సంబంధం లేకపోయినా బుద్దా వెంకన్న బీసీ నేత హోదాలో రంగంలోకి దగడంతో ఇప్పుడు .. వైసీపీ కూడా జోక్యం చేసుకుంటే ఆ పొలిటికల్ సైకిల్ పూర్తవుతుందన్న అంచనా వినిపిస్తోంది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ఎవరూ పైకి మిత్రులు కాదు.. అలాగని... అందరూ శత్రువులు కాదు. ఎవరికి వారు .. మిత్రులు శత్రువులు ఉన్నారు. అదే రాజకీయం. 



Join Us on Telegram: https://t.me/abpdesamofficial