Diwali 2022: దీపం పరబ్రహ్మ స్వరూపం,జ్ఞానానికి చిహ్నం. చీకట్లను పారద్రోలి వెలుగులను ఏవిధంగా కురిపిస్తుందో..అదేవిధంగా మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన సముపార్జన చేయాలన్నదే దీపం వెనుకున్న ఆంతర్య. అందుకే అన్ని పవిత్ర సందర్భాలలోనూ  ఆలోచనలకు సాక్షిగా జ్యోతిని వెలిగిస్తారు. దీపపు కుందిలో పోసే నెయ్యి లేదా నూనె మనలోని అహంకారానికి, వత్తి కోరికలకు సంకేతం. దేవుడి ముందు దీపం వెలిగించగానే ఆ వెలుగుకు మనలోని దుర్గుణాలన్నీ క్రమక్రమంగా దహించుకుపోతూ సన్మార్గంవైపు అడుగులేస్తున్నామని గ్రహించాలి. అందుకే భారతీయ సంప్రదాయంలో దీపానికి విశేష స్థానం ఉంది. 


Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు, బాణసంచా ఎందుకు కాలుస్తారు!


దీపావళి అంటే దీపసముదాయం అని అర్థం. అంధకారం నిరాశకు, అజ్ఞానానికి గుర్తు, కాంతి ఆశకు, జ్ఞానానికి గుర్తు. కటిక చీకట్లలో కాంతిపుంజాలని, నిశ్శబ్దంలో సంతోషాల శబ్దాన్ని, నీరసంలో ఉత్సాహాన్ని నింపే ఆనంద కేళి దీపావళి. అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగులోకి తీసుకువెళ్లే పండుగే ఇది. సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా దీపావళి పండుగను భావిస్తారు! దీపావళి  శరదృతువులో రావడం మరో విశేషం. మనో నిశ్చలతలకు, సుఖశాంతులకు అనువైన కాలం ఇది!  సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి దీపావళి రోజున భక్తిశ్రద్ధలతో ఆమెను పూజించి ఆశీస్సులు అందుకుంటారు. ఈ దీపావళి రోజు ఏ ఇంటిలో దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ఈరోజున దీపాలవరుసతో లక్ష్మీదేవికి నీరాజనాలు అందిస్తారు. ఈరోజున సాయంసంధ్య సమయంలో లక్ష్మీ రూపమైన తులసికోట ముందు ముందుగా దీపాలు వెలిగించి శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని అష్టోత్తరాలతో పూజించి గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని విశ్వసిస్తారు. మరి అలాంటి దీపాలను ఎలా పెట్టాలంటే.....


Also Read: దీపావళికి పెట్టే దీపాల్లో శనిదోషం తొలగించుకునేందుకు పెట్టేదీపం వేరే!


దీపం ఈ విధంగా పెట్టండి



  • దీపం ప్రతిరోజూ చేయమని సనాతన ధర్మం  చెబుతోంది. దీపాన్ని తూర్పు వైపు పెడితే ఆరోగ్యం కలుగుతుంది. పశ్చిమంలో పెడితే భక్తి పెరుగుతుంది. ఉత్తరానికి పెడితే ఐశ్యర్యకారకం అవుతుంది. దక్షిణానికి పెట్టడం అశుభం, మృత్యుకారకం

  • భగవంతుడికి దీపం ఏవైపు ఉండాలనే నియమం ఉంది. మహాశివుడికి ఎడమవైపు, విష్ణువుకు కుడిపైపు దీపాన్ని ఉంచాలి.

  • దీపాన్ని మధ్యలో పెట్టరాదు. అదేవిధంగా ఒకే వత్తితో దీపాన్ని వెలిగించరాదు.

  • దీపారాధనకు ఆవునెయ్యి, నువ్వుల నూనె శ్రేయస్కరం. లక్ష్మీదేవికి నేతి ప్రీతిదాయకం కావడంతో ఆమెను స్తుతించి ఈ దీపారాధన చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

  • సాయంత్రం లేదా ఉదయం పూట ఆవునేతితో దీపము వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.

  • నేతి దీపాన్ని ఇంట వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరుతాయి.


దీపారాధన ఇలా చేయాలి!



  • దీపారాధనలో ఒకసారి వెలిగించిన వత్తిని మరోసారి ఉపయోగించకూడదు...కేవలం అగరొత్తులతోనే దీపాన్ని వెలిగించాలి.

  • కాండిల్స్ లాంటివి వాడకూడదు. వెలిగించిన దీపంతో మరోదీపం వెలిగించకూడదు

  • ఇక ఏకముఖి దీపం మధ్యమం, ద్విముఖం కుటుంబ ఐక్యత, త్రిముఖం ఉత్తమ సంతాన సౌభాగ్యం, చతుర్ముఖం పశుసంపద, ధన సంపద పంచముఖ దీపం వల్ల సిరిసంపదల వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు

  • దీపారాధనకు మట్టి, వెండి, పంచలోహాదులతో తయారైన ప్రతిమలను వాడడం శ్రేయస్కరం. ఒకవేళ పూజ మధ్యలో దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి మళ్లీ వెలిగించాలి.