Diwali 2022: దీపావళి వేడుకలు జరుపుకోవడంపై కొంత అయోమయం నెలకొంది. ఈ నెల 25 సాయంత్రం సూర్య గ్రహణం ఏర్పడుతోంది. అయితే 25 మంగళవారం సూర్యోదయం సమయానికి అమావాస్య ఉంది. సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతోంది. అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించే సమయానికి అమావాస్య ఘడిలు పూర్తై పాడ్యమి ఘడియలు మొదలవుతాయి. పండుగ పేరే దీపావళి అమావాస్య అయినప్పుడు అమావాస్య లేకుండా పండుగ ఎలా చేస్తామని కొందరి వాదన అయితే... సర్యోదయానికి తిథి లెక్కకాబట్టి ఎందుకు చేసుకోరాదన్నది మరికొందరి వాదన. 


Also Read: అక్టోబరు, నవంబరులో రెండు గ్రహణాలు - ఈ రాశులవారు చూడకూడదు!


దీపావళి ఎప్పుడంటే!
ఒక్కమాటలో చెప్పాలంటే దీపావళి ఈనెల 24 సోమవారం జరుపుకోవాలి. ఈ రోజు సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉన్నప్పటికీ  సూర్యాస్తమయం సమయానికి అమావాస్య వచ్చేస్తుంది. దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సోమవారం రాత్రి ( 24 తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. 


ఇంకా సందేహాలుంటే..చతుర్థశి, అమావాస్య ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటివరకో ఇక్కడ చూడండి...
అక్టోబరు 24 సోమవారం సాయంత్రం 4.49  వరకూ చతుర్థశి ఉంది.. అంటే దాదాపు 5 గంటల నుంచి అమావాస్య మొదలవుతోంది...
అక్టోబరు 25 మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకు అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతోంది.  అంటే సూర్యాస్తమయానికి  అమావాస్య ఉండదు 


చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారంతా. దీపావళి గురించి పురాణకథనాల విషయానికొస్తే భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తాను తల్లిచేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీమహావిష్ణువుకి  తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేస్తాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాతి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. త్రేతాయుగంలో రావణుడిని హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని చెబుతారు.


Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి, ఏ రోజు ఏం చేయాలి, ప్రాముఖ్యత ఏంటి!


ఇక అక్టోబరు 25  మంగళవారం సూర్య గ్రహణం సమయం ఇదే... 
శ్రీ శుభకృత్ నామసంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారం అక్టోబరు 25వ తేదీ స్వాతి నక్షత్రం రెండో పాదంలో కేతుగ్రస్త సూర్యగ్రహణం సాయంత్రం దాదాపు 5.03 నిముషాలకు ప్రారంభమవుతుంది.  
స్పర్శ కాలం సాయంత్రం - 5 గంటల 3 నిముషాలు
మధ్య కాలం సాయంత్రం - 5 గంటల 28 నిముషాలు
మోక్ష కాలం సాయంత్రం  - 5 గంటల 35 నిముషాలు
ఆద్యంత పుణ్యకాలం 32 నిముషాలు


ఈ గ్రహం స్వాతి నక్షత్రం తులా రాశిలో పడుతుంది. అందుకే చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల వారు  కన్య,తులా రాశివారు ఈ గ్రహం చూడరాదని చెప్పారు పండితులు. గ్రహణ కాలం 32 నిముషాలే కాబట్టి.. నియమాలు పాటించే గర్భిణి స్త్రీలకు పెద్దగా సమస్య ఉండదు.