Bigg Boss 6 Telugu:

  బిగ్‌బాస్‌ రియాల్టీ షో తెలుగులో మొదలైనప్పటి నుంచి ఏదో ఓ వివాదం కొనసాగుతూనే ఉంది. బిగ్ బాస్ 6 తెలుగు రియాల్టీ షోపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. కార్యక్రమాన్ని సెన్సార్‌ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని, ఆ కంటెంట్ ను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రచారం చేయాల్సి ఉంటుందని, అయితే రాత్రి 9 గంటలకే ప్రసారం చేస్తున్నారని పిటిషనర్ తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. 


అశ్లీలం, అసభ్యత అని ఆరోపణలు.. 
బిగ్ బాస్ రియాల్టీ షోపై మొదట్నుంచీ హింస, అశ్లీలం, అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు అని ఆరోపణలున్నాయి. సీపీఐ నేత నారాయణ లాంటి వారైతే అదొక బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారాన్ని ఏకంగా రికార్డ్ చేసి టీవీలలో చూపిస్తున్నారని, సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నారాయణతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు గతంలోనే ప్రశ్నించారు. అశ్లీలం, అసభ్యతను ప్రోత్సహించేలా రియాల్టీ షో తెలుగు ‘బిగ్‌బాస్‌’ ఉందని ఆరోపిస్తూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఏపీ హైకోర్టులో పిల్‌ వేశారు. కనుక రియాల్టీ షో ప్రదర్శనను ఆపేయాలని కోర్టును కోరారు. 


రాత్రి 11 తరువాత ప్రసారం చేయాలి, లేకపోతే 
హైకోర్టులో విచారణ సందర్భంగా.. కార్యక్రమాన్ని సెన్సార్‌ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. బిగ్ బాస్ షోలో పాల్గొనే మహిళా కంటెస్టెంట్స్‌కు ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తున్నారని.. ఇలాంటి కార్యక్రమాలను నిబంధనల ప్రకారం  రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలన్నారు. కానీ బిగ్ బాస్ షోను రాత్రి 9 నుంచి ప్రసారం చేస్తున్నారని, దీనిపై సెన్సార్‌ బోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టుకు విన్నవించారు. నిర్వాహకులు రేటింగ్, ప్రచారం కోసం ఇలాంటివి చేస్తుంటారని, అందులో భాగంగానే ఈ వ్యాజ్యం దాఖలు చేశారా? అని పిటిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.


మేం బిగ్ బాస్ వీక్షిస్తాం: ఏపీ హైకోర్టు ధర్మాసనం
రియాల్టీ షో బిగ్ బాస్‌లో ఏం జరుగుతుంది, ఏముందో తెలుసుకునేందుకు ఒకట్రెండు ఎపిసోడ్లను వీక్షిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసును పరిష్కరించడానికి ముందు తాము ‘బిగ్‌బాస్‌’ను చూస్తామని, అప్పుడే ఈ షో మీద తమకు అవగాహనా వస్తుందన్నారు. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ షోపై వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా, ప్రస్తుతం నోటీసులు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. 


Bigg Boss 6 Telugu Episode38: భార్యను, కూతురిని చూసి ఆదిరెడ్డి ఫుల్ రీఛార్జ్, సుదీపకు భర్త ఫోన్ కాల్, శ్రీహాన్‌కు మటన్ బిర్యానీ