Tirumala Latest News: అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం
ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత
అన్ని ర‌కాల ద‌ర్శనాలు ర‌ద్దు - స‌ర్వద‌ర్శనం భ‌క్తుల‌కు మాత్రమే అనుమ‌తి
గ్రహ‌ణ స‌మ‌యంలో అన్నప్రసాద వితరణ రద్దు


తిరుపతి : అక్టోబ‌రు 25వ తేదీన సూర్య గ్రహణం ( Solar Eclipse 2022 ), న‌వంబరు 8న చంద్ర గ్రహ‌ణం ( Lunar Eclipse 2022) ఏర్పడనున్నాయి. ఆ కార‌ణంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు ఆల‌య త‌లుపులు మూసివేయనున్నారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ (TTD) ర‌ద్దు చేసింది. స‌ర్వద‌ర్శనం భ‌క్తుల‌ను మాత్రమే అనుమ‌తిస్తారు. అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. అనంత‌రం స‌ర్వద‌ర్శనం భ‌క్తుల‌ను మాత్రమే అనుమ‌తిస్తారు. 
అదేవిధంగా న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. స‌ర్వద‌ర్శనం భ‌క్తుల‌ను మాత్రమే అనుమ‌తిస్తారు. 


గ్రహ‌ణ స‌మ‌యంలో అన్నప్రసాద వితరణ రద్దు
సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొల‌గిపోయే వరకు వంట చేయరు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్రసాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద విత‌ర‌ణ ఉండ‌దు. కావున‌ భ‌క్తులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా త‌మ తిరుమల యాత్రను రూపొందించుకోవాల‌ని టీటీడీ మ‌రోసారి విజ్ఞప్తి చేస్తోంది.


దర్శనంలో సమూల మార్పులకు టీటీడీ చర్యలు
తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనంలో సమూల మార్పులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanam) ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. శ్రీవారి దర్శనం సులభతరం, శీఘ్రముగా అయ్యేలా సామాన్య భక్తులకు టైం స్లాట్ విధానంను త్వరలో అమలు చేయనుంది. అత్యాధునిక టెక్నాలిజీతో గదులు కేటాయింపు చేస్తుంది టీటీడీ. తిరుమలకు వెళ్ళగానే నేరుగా గదులలోకి వెళ్లి రిల్యాక్స్ అయ్యేలా నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. తిరుపతిలో ఎన్ రోల్ చేసుకుంటే తిరుమలలో వసతి గదులు మరింత సులభతరంగా గదుల కేటాయింపు ప్రక్రియ కానుంది. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేసే విధంగా విఐపి బ్రేక్ దర్శనాలలో చారిత్రాత్మక మార్పులు తీసుకురానున్న టీటీడీ అధికారులు. సామాన్య భక్తులే ముందు, విఐపి అనంతరం (VIP Darshans) అంటూ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పు చేయనున్న టీటీడీ. గదుల కేటాయింపుపై ఒత్తిడి., సామాన్య భక్తులకు త్వరిత గతిన దర్శనం కల్పించే విధానం త్వరలోనే ప్రారంభం కానుంది.

Also Read: తిరుమలలో ప్రతి బుధవారం శ్రీవారికి ఏం నైవేద్యం సమర్పిస్తారంటే !