Munugode Bypolls :  మునుగోడు ఉపఎన్నికలు సస్పెన్స్ ధ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల అగ్రనేతలు మునుగోడులోనే మకాం వేశారు. మూడు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. అయితే బీజేపీ, టీఆర్ఎస్ మాత్రం ఆరోపణలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ఒకే అంశంపై రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ అంశం "18".  మీది పద్దెనిమిది వేలు అని టీఆర్ఎస్ ..బీజేపీపై విరుచుకుపడుతూంటే.. మీది పద్దెనిమిది లక్షలని బీజేపీ.. టీఆర్ఎస్ పై మండి పడుతోంది. ఇంతకీ ఈ 18  విషయం ఏమిటంటే ?


18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే ఉపఎన్నిక తెచ్చారని రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ విమర్శలు!


మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే 18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకుని బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ టీవీ చానల్ ఇంటర్యూలో తనకు ఓపెన్ బిడ్డింగ్‌లో కాంట్రాక్ట్ వచ్చిందని రాజగోపాల్ రెడ్డి అంగీకరించారు. దీంతో టీఆర్ఎస్ తన ఆరోపణల్ని మరింతగా పదును పెట్టింది.  ఫోన్ పే త‌ర‌హాలో కాంట్రాక్ట‌ర్ పే పేరిట పోస్ట‌ర్లు కూడా మునుగోడులో వేశారు.  ఈ పోస్ట‌ర్లలో.. రూ. 18 వేల కోట్ల కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి కేటాయించ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు.  BJP18THOUSANDCRORES అంటూ ట్రాన్సక్షన్ ఐడీని ఉంచారు. అలాగే రూ. 500 కోట్ల బోనస్ అంటూ ఫోన్ పే ట్రాన్సక్షన్ తరహాలో కాంట్రాక్టు పేరుతో వేలాది పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి. ఈ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఆరోపణలు రాజగోపాల్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 


18 లక్షల ఎకరాలను కేసీఆర్ కుటుంం ఆక్రమించుకుందని రాజగోపాల్ రడ్డి ఆరోపణ !


తనపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఆరోపణలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబం 18 లక్షల ఎకరాలను ఆక్రమించుకోవడానికే ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారని ఆరోపించారు.  హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నీ కేసీఆర్ కుటుంబం చేతిలోకి వెళ్లిపోయాయన్నారు. ‘‘ ధరణి పోర్టల్ దేశంలోనే పెద్ద స్కాం. ‘ధరణి’ వచ్చాక 24 లక్షల ఎకరాల భూములను హోల్డ్ చేశారు.. 6 లక్షల ఎకరాలను హోల్డ్ చేసి, డబ్బులు తీసుకున్నాక రిలీజ్ చేశారు. 18 లక్షల కోట్ల విలువైన భూములు కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నాయి’’ అని ఆయన ఆరోపణలు చేశారు. భూములన్నీ వాళ్ల కంట్రోల్ లోనే ఉన్నాయి. ఇది రూ.18 లక్షల కోట్ల విలువైన స్కామ్ అని ఆరోపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఈ స్కామ్‌పై సీబీై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. 


"18" మాత్రమే ఎంచుకుని ఎందుకు ఆరోపణలు !


రెండు పార్టీలు 18 అంకెను బేస్ చేసుకునే ఆరోపణలు చేసుకుంటున్నాయి.  వేలు, లక్షలు మాత్రమే తేడా. అన్నీ కోట్లే. రెండు పార్టీలు యాధృచ్చికంగా ఈ ఆరోపణలు చేసుకుంటున్నాయా లేకపోతే.. వ్యూహాత్మకంగానే 18ని ఎంచుకున్నాయా అన్నదానిపై స్పష్టత లేదు. రాజకీయాల్లో నమ్మకాలు కూడా ముఖ్యమే. చాలా మంది వాటికే ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో రెండు పార్టీలు ఎవరైనా సంఖ్యా శాస్త్రవేత్తను కలిశారేమోనని ఆయన పద్దెనిమిది కలిసి వస్తుందని చెప్పారేమోనన్న సందేహాలు కూడా కొంత మందిలో ఉన్నాయి. కారణాలు ఏమైతేనేమీ.. ఇప్పటికైతే బీజేపీ ఖాతాలో రూ. 18వేల కోట్లు.. టీఆర్ఎస్ ఖాతాలో రూ. 18 లక్షల కోట్ల ఆరోపణలు వచ్చి పడ్డాయి. వీటిపై నిజాలు ఎప్పటికీ బయటకు రావు. ఎన్నికలైపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు.