దీపావళి..చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారంతా. దీపావళి గురించి పురాణకథనాల విషయానికొస్తే భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తాను తల్లిచేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీమహావిష్ణువుకి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేస్తాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాతి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. త్రేతాయుగంలో రావణుడిని హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని చెబుతారు. ఇక ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఐదురోజుల పాటూ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే వాస్తవానికి దీపావళి ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియతో ముగుస్తాయి.
1.ధన త్రయోదశి ( Dhanteras 2022)
ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రోజున కొందరు బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. క్షీరసాగర మథనంలో ఇదే రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి. ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు.
Also Read: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!
2.నరక చతుర్దశి (Naraka Chathurdasi)
ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు అంటే దీపావళి ముందు రోజు అన్నమాట. ఈ రోజు నువ్వుల నూనె పట్టించుకుని తలంటు పోసుకుంటే దోషాలు పోతాయని చెబుతారు. నరకాసుర వధ జరిగిన ఈ రోజునుంచే క్రాకర్స్ కాల్చడం మొదలుపెడతారు.
3.దీపావళి అమావాస్య (Diwali 2022)
ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండగ. సంధ్యా సమయంలో లక్ష్మీపూజ చేస్తారు. అనంతరం స్వీట్స్ తిన్నాక ఇల్లంతా దీపాల వెలుగులతో నింపేసి బాణసంచా వెలిగిస్తారు. ఈ రోజు లక్ష్మీపూజ చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుందని భావిస్తారు.
4.బలి పాడ్యమి (Balipratipada 2022)
దీపావళి మర్నాడు అంటే కార్తీకమాసం మొదటి రోజుని బలిపాడ్యమి అని అంటారు. చతుర్దశి రోజు విష్ణుమూర్తి పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి తిరిగి భూమ్మీదకి వచ్చిన రోజు అని చెబుతారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. మరోవైపు శ్రీకృష్ణుడు గోవర్థనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడినదీ ఇదే రోజు.
Also Read: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!
5. యమ విదియ (Yama Dwitiya 2021)
దీపావళి నుంచి రెండోరోజు, కార్తీకమాసంలో రెండో రోజు వచ్చే విదియను యమవిదియ అంటారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే పురాణాల్లో మరో రాఖీపండుగ అన్నమాట. దీన్నే యమద్వితీయ అనికూడా అంటారు. ఈ రోజున సోదరుడికి స్వయంగా వండి వడ్డిస్తారు సోదరీమణులు. సోదరి చేతి భోజనం తిన్న సోదరుడికి ఆయురారోగ్య ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు.దీనివెనుక ఓ కథ కూడా చెబుతారు. సూర్యభగవానుడి కుమారుడు యముడు, ఆయన సోదరి యమున. ఆమెకు సోదరుడంటే అంతో అభిమానం. ఎన్నిసార్లు ఇంటికి ఆహ్వానించినా యముడు మాత్రం క్షణం తీరికలేకుండా ఉండేవాడు. అయితే కార్తీక విదియ రోజు తప్పకుండా రావాలని చెప్పి వాగ్ధానం తీసుకుంటుంది యమున. యముడు కూడా తనను ఎవ్వరూ ఇంటికి పిలవరు పైగా స్వయాన తోబుట్టువుకి వాగ్ధానం చేసి వెళ్లకుండా ఉండడం భావ్యం కాదని భావించిన ఇంటికెళతాడు. యముడిని చూసి సంతోషించిన యమున అభ్యంగన స్నానం చేయించి , తిలకం దిద్ది, స్వయంగా వంట చేసి ప్రేమగా వడ్డిస్తుంది. సంతోషించిన యముడు సోదరిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఏటా ఇదే రోజున తన ఇంట విందుకి రావాలని కోరుతుంది. సరే అని చెప్పిన యముడు సోదరీ, సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుందంటాడు. ఆ రోజు నుంచి ఏటా కార్తీకమాసంలో రెండో రోజు విదియ రోజు సోదరులు సోదరిల ఇంటికెళ్లి భోజనం చేయడం విధిగా వస్తోంది. రాఖీ రోజు అన్నదమ్ముడు సోదరికి కానుకలిస్తే..భగనీహస్త భోజనం రోజు సోదరి.. సోదరుడికి భోజనం పెట్టి కొత్త వస్త్రాలు అందిస్తుంది.
ఇలా ఐదురోజుల పాటూ దీపావళి వేడుకలు జరుపుకుంటారు