Dhanteras 2022 Date: ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రోజున కొందరు బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు.


ధనత్రయోదశి (Dhanteras 2022) ఎప్పుడు
దీపావళి పండుగ ధనత్రయోదశి తోనే ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది ధన త్రయోదశి విషయంలోనూ చిన్న గందరగోళం ఉంది. ఎందుకంటే అక్టోబరు 22 శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన త్రయోదశి తిథి..అక్టోబరు 23 ఆదివారం సాయంత్రం వరకూ ఉంది. ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేస్తారు కాబట్టి ఏ రోజు చేయాలి అనే ఆలోచలో ఉన్నారు. అయితే ఉపవాసం నియమాన్ని అనుసరించి పూజ చేయాలి అనుకునేవారికి మాత్రం అక్టోబరు 23నే త్రయోదశి పూజ చేసుకోవాలంటున్నారు పండితులు. 


Also Read: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!


ధనత్రయోదశి (Dhanteras 2022) రోజు బంగారం ఎందుకు కొంటారంటే
ఈ  రోజునే బంగారం ఎందుకు కొనుగోలు చేయాలి..ఈ సెంటిమెంట్ వెనుకున్న కొన్ని పురాణ కథలు తెలుసుకోవాలి.
అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందట. అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం.  ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు. అందుకే ధంతేరాస్ వచ్చేసరికి బంగారం వెండి ధరలు పెరిగినా సెంటిమెంట్ ను ఫాలో అయ్యే వినియోగదారులు మాత్రం కొనుగోలు చేసేందుకు వెనకాడరు.


ధన్వంతరి జయంతి (dhanvantari jayanti 2022)
ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి.  ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం  ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు. 


Also Read: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి


ఉత్తరాది పండుగ
ధనత్రయోదశిని దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తరాదివారే ఎక్కువగా జరుపుకుంటారు. రాను రాను సెంటిమెంట్స్  పెరిగి దక్షిణాదివారూ ఫాలో అవుతున్నారు. బంగారం-వెండి కొనుగోలు చేయడం, లక్ష్మీపూజ చేయడం మంచిదే కదా ఇందులో తప్పేముందని భావిస్తున్నారు. అందుకే తమ శక్తి కొలది బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. వినాయకుడు, లక్ష్మీదేవి, కుబేరుడి బొమ్మలు కొత్తవి కొనుగోలు చేసి పూజించడాన్ని  శుభప్రదంగా భావిస్తారు. సాధారణంగా ఈ పూజను ప్రదోష వేళలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాల కాలాన్నే ప్రదోషకాలం అంటారు. ధన త్రయోదశి రోజున ఎవ్వరికీ అప్పులు ఇవ్వడం, అనవసర ఖర్చులు చేయడం చేయరు..