దసరా పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆ గ్రామంలో దాదాపుగా 100 సంవత్సరాల నుంచి సాంప్రదాయబద్ధమైన ఆచారాలను పాటిస్తున్నారు. దసరా వచ్చిందంటే చాలు ఆ ఊరి యువకులు విన్యాసాలకు పోటీ పడతారు. ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలతో అబ్బురపరుస్తారు. ఏటా ఏదో ఓ కొత్త సాహసం చేసి ఔరా అనిపిస్తారు. దసరా, ఆ మరుసటి రోజున జరిగే వారి ప్రదర్శనలను చూసేందుకు జనం ఎగబడతారు. దసరా పండుగ సందర్భంగా ఈ ఏడాది ఆ విలేజ్ హీరోస్ ప్రదర్శించిన విన్యాసాలను చూడాలంటే కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని గుడికల్ గ్రామ యివకులు ప్రతి ఏడాది దసరా పండుగ సందర్బంగా సహోసోపేతమైన విన్యాసాలు ప్రదర్శిస్తారు.. దాదాపు 100 సంవత్సరాల నుంచి గ్రామస్థులు విన్యాసాలు ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. సంవత్సరం పాటు పిల్లల నుంచి యువకుల వరకు విన్యాసాలను నేర్చుకొని ప్రదర్శిస్తూ అందరితో ఔరా అనిపించుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం లాగే దసరాను పురష్కరించుకొని గుడికల్ గ్రామానికి చెందిన గస్తీని గల్లీ, రామమ్మ గల్లీ, చింతామన్ గల్లీకి చెందిన యువకులు ప్రదర్శించే విన్యాసాలు ప్రేక్షకులను ఒళ్ళు గగుర్పొడిచాయి. ట్రిపుల్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఓ సన్నివేశంలో యువకులు కాళ్లకు పెద్ద మొద్దు వేసుకొని చేతులు కట్టేసి, గాల్లో పైకి లాగి వీపుకు ట్యూబ్ లైట్లు పగలకొట్టారు.
ఇనుప డ్రమ్ములపై పెట్రోల్ వేసి నిప్పు అంటించి వాటిపై నుంచి ఎగురుతూ, శరీరానికి ఇనుప కొక్కిళ్లు తగిలించుకొని గాలిలో సినిమాలో మాదిరి వేలాడటం, నడవటం, బల్బులను విపులపై పగలకొట్టడం, చిన్న పిల్లలు సైతం శూలాలు కుచ్చుకొని, తాడు సహాయంతో గ్యాస్ సిలిండర్ పైకి లేపడం, బరువైన వస్తువులు వీపునకు కొక్కిళ్ళు వేసుకొని తాడు లాగుతు వాటిని ఎత్తడం, వంటి ఎన్నో సాహసాలు ప్రదర్శించారు.
అయితే విన్యాసాల్లో కొంతమందికి రక్తం వస్తే వాటిపై అమ్మవారి పసుపు పూయడంతో అది మానిపోతుందని అక్కడి వారి గట్టినమ్మకం. వీటిని తిలకించడానికి చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
చుట్టుపక్కల గ్రామాల వాసులతోపాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ గ్రామానికి చేరుకొని విన్యాసాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ప్రతి సంవత్సరం దసరా మహోత్సవంలో కొత్త కొత్త సాహసాలతో ప్రజల ముందుకు విన్యాసాలను ప్రదర్శించడంలో ఆ యువత క్రేజే వేరయా అనేంత పని చేస్తారట. ఆ గ్రామ యువతను ప్రజలు ఔరా అనిపించేలా విన్యాసాలు చేసి అందరి నుంచి మన్నన్నలు పొందుతారు. ఆ సాహసాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా, అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా అన్ని రకాల చర్యలను గ్రామపెద్దలు తీసుకుంటారు.