Karwa Chauth and Atla Taddi 2022: హిందూమతంలో కర్వా చౌత్ (అట్ల తదియ)కు విశేష ప్రాధాన్యత ఉంది. వివాహిత మహిళలు..భర్తల సౌభాగ్యం కోసం ఏటా ఆశ్వయుజ బహుళ తదియ రోజు ఈ పూజ చేస్తారు. ఈ ఏడాది ఈ పూజ ఎప్పుడు చేయాలంటే..
ఈ ఏడాది కర్వా చౌత్ ఎప్పుడు చేసుకోవాలనే గందరగోళంలో ఉన్నారు కొందరు. అక్టోబరు 12 అని కొందరు, అక్టోబరు 13 అని కొందరు అంటున్నారు. అయితే స్పష్టంగా చెప్పాలంటే ఈ విషయంలో అస్సలు కన్ఫ్యూజన్ అవసరం లేదు.. ఎందుకంటే తదియ తిథి తగులు మిగులు అస్సలు లేదు.. అక్టోబరు 12నే జరుపుకోవాలి. ఇంతకీ కర్వా చౌత్ అంటే తెలుగువారికి అర్థమయ్యేలా చెప్పాలంటే అట్లతదియ.
ఈ ఏడాది అట్లతదియ అక్టోబరు 12 బుధవారం వచ్చింది. తదియ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఉందంటే...
అక్టోబరు 11 మంగళవారం రాత్రి 1.20 నుంచి ప్రారంభమైన తతియ ఘడియలు అక్టోబరు 12 రాత్రి 1.42 వరకూ ఉన్నాయి. అంటే సూర్యోదయం, చంద్రోదయం సమయానికి తదియ ఘడియలు ఉన్న రోజు బుధవారం..అందుకే కర్వా చౌత్( అట్ల తదియ) బుధవారమే జరుపుకోవాలి.
Also Read: అక్టోబరు 25న సూర్యగ్రహణం, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి
అట్ల తదియ ఎవరు జరుపుకుంటారు!
హిందూ, పంజాబీ కమ్యూనిటీల్లో వివాహిత మహిళలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో కర్వా చౌత్ ఒకటి. ఈ పండుగ భర్తకు దీర్ఘాయువును కోరుతూ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆశిస్తూ అట్లతదియ నోము నోచుకుంటారు. ఏటా ఆశ్వయుజ బహుళ తదియ రోజు అట్లతదియ చేసుకుంటారు. అంటే..దసరా పండుగ అయ్యాక 8 రోజులకు అట్లతదియ వస్తుంది.
అవివాహితులకు మరింత ప్రత్యేకం
వివాహితులు మాత్రమే కాదు పెళ్లికాని యువతులకు మరింత ప్రత్యేకం అట్లతదియ. మంచి భర్త రావాలని, వైవాహిక జీవితం బావుండాలని పెళ్లికాని యువతులు ఈ నోము నోచుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా అంటారు.
అట్లతదియ అంటే ఏం చేస్తారు
అట్ల తదియకు ముందు రోజు రాత్రే కన్నెపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు పెట్టుకుంటారు. తదియ రోజు తెల్లవారుజామునే లేచి అన్నం, కందిపచ్చడి, గోంగూర పచ్చడి, కూర, పెరుగుతో కడుపునిండా అన్నం తిని..తాంబూల వేసుకుంటారు. ఇలా తినడాన్నే 'ఉట్టికింద ముద్ద' అందంగా. ఆ తర్వాత సూర్యోదయం అయ్యేవరకూ ఆటపాటలతో సందడిగా గడుపుతారు. తలకు స్నానం చేసి అందంగా అలంకరించుకుని పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటారు. మధ్యలో పండ్లు తినొచ్చు. చీకటి పడేసరికి మళ్లీ గౌరీదేవికి పూజ చేసి, చంద్రుడిని దర్శించుకుని వ్రత కథ చెప్పుకుంటారు. ముత్తైదువికి వాయనం ఇచ్చిన తర్వాత అట్లు తింటారు. ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహంతో సౌభాగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది.
Also Read: గడ్డిపై ప్రతీకారం తీర్చుకునేవాళ్లుంటారా ... కానీ చాణక్యుడి విజయం అక్కడి నుంచే మొదలైంది..