మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు (D Ramanaidu) కుటుంబం నుంచి మరొకరు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. ఆయన మనవడు అభిరామ్ (Abhiram Daggubati) కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తేజ (Teja) దర్శకత్వంలో రూపొందుతోన్న 'అహింస' (Ahimsa Movie) సినిమాలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. 


కృష్ణతత్వం...
బుద్ధిడి రాక!
'అహింస' (Ahimsa Movie Teaser) టీజర్ విషయానికి వస్తే... అందమైన పల్లె వాతావరణంలో సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. పొలంలో ట్రాక్టర్ సహాయంతో నాగలి పనులు చేస్తున్న సాధారణ యువకుడిగా అభిరామ్‌ను పరిచయం చేశారు. అతడు అంటే పడి చచ్చే ఓ అమ్మాయి... వరసకు అతడికి మరదలు అవుతుంది. సాఫీగా సాగుతున్న వీళ్ళిద్దరి ప్రపంచంలో హింస ఎలా చోటు చేసుకుంది? దాన్నుంచి ఎలా బయట పడ్డారు? అనేది కథగా తెలుస్తోంది.
 
''ఒక ఇంగ్లీష్ ఇవ్వు...'' అని హీరోను హీరోయిన్ ముద్దు అడిగితే ''నేను ఇవ్వను, నిన్ను అస్సలు ఇవ్వనివ్వను'' అని అతడు చెప్పడం ముద్దు ముద్దుగా ఉంది.


''కృష్ణతత్వం మూడు ముక్కలో చెబుతాను విను - మూసి, తీసి, ఏసేయ్!'' అని హీరోయిన్ చేత చెప్పించారు దర్శకుడు. ''అలా కృష్ణుడి మాటలు విని దేశం మొత్తం యుద్ధాలు చేసుకుంటూ ఒకరినొకరు చంపుకుంటుంటే... బుద్ధుడి వచ్చి అహింసో పరమో ధర్మః అన్నాడు. అంతే... అప్పటి నుంచి దేశం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది'' అని హీరో కౌంటర్ ఇచ్చారు.
 
తేజ మార్క్ ప్రేమ, విలనిజంతో సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది. అతి త్వరలో థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. 



ఆర్పీ పట్నాయక్ సంగీతంలో...
దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ల‌ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. 'చిత్రం', 'నువ్వు నేను', 'జయం', 'నిజం', 'అవునన్నా కాదన్నా', 'లక్ష్మీ కళ్యాణం' వంటి మ్యూజికల్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఉన్నాయి. కొంత విరామం తర్వాత మళ్ళీ తేజ, ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) చేస్తున్న సినిమా 'అహింస'. 


న్యాయవాదిగా సదా!
'అహింస' సినిమాలో న్యాయవాది పాత్రలో సదా నటిస్తున్నట్లు తెలిసింది. దగ్గుబాటి అభిరామ్ సరసన గీతిక కథానాయికగా నటించారు. రజత్ బేడీ, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : అనిల్ అచ్చుగట్ల, పోరాటాలు : 'రియల్' సతీష్, కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి, సాహిత్యం : చంద్రబోస్, సంగీతం : ఆర్పీ పట్నాయక్.


Also Read : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!






వెంకటేష్, రానా తర్వాత...దగ్గుబాటి రామానాయుడు కుమారుల్లో సురేష్ బాబు నిర్మాత కాగా... వెంకటేష్ హీరో అయ్యారు. సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా తొలుత వీఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ వర్క్స్ చేసినా... ఆ తర్వాత నటుడిగా, కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తున్నారు. వెంకటేష్, రానా తర్వాత దగ్గుబాటి కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో అభిరామ్.  


Also Read : Yash Movie In Telugu : తెలుగు ప్రేక్షకుల ముందుకు 'రారాజు'గా యష్ - విషయం ఏంటంటే?