హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే ఎవరైతే భక్తి పూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో.. పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో వారు పెట్టిన  నైవేద్యాన్ని దైవం తృప్తిగా స్వీకరిస్తుందని చెబుతారు. అయితే పూలు కొనుక్కొచ్చేవారి సంగతి పక్కనపెడితే…చుట్టుపక్కల ఇళ్లలోంచి ఎత్తుకొచ్చేవారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం….




రోజూ ఉదయాన్నే చాలామంది మహిళలు పూజకోసం పూలు కోస్తుంటారు. ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే పర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే పూలచెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. కొంతమంది వాకింగ్ కోసం వెళ్లి కూడా ఓ కవర్ తీసుకెళ్లి వస్తూ వస్తూ దార్లో కనిపించిన పూలన్నీ కోసేస్తారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నారనుకోండి… వాళ్లకేసి సీరియస్ గా చూస్తూ..వీళ్లకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు. అంతేకాదు వీళ్లు మహా పాపాత్ములని ఫిక్సైపోతారు. వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి.. కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం. ఇక ఆ ఇంట్లో వాళ్లని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం క్రిందకి వస్తుంది. పూలుకోసుకున్నప్పడు కూడా ఇంటి యజమానిని అడగాలి…అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్లిపోతుంది. ఈ విషయాలు గరుడపురాణంలో ఉంటాయి. దీనికోసం ఓ శ్లోకం కూడా ఉంది.


తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే |


ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు ||


అంటే….తాంబూలం, పండ్లు, పూలు వాటిని దొంగతనం చేసినవారు అడవిలో కోతిలా పుడతారు….


చెప్పులు, గడ్డి, ప్రత్తి దొంగతనం చేసినవారు మరు జన్మలో మేకలా పుడతారు.




వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి. మోక్షం కలగాలి. వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి. కానీ ఆ ఇంటి యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకుంటున్నాం. పూలు కోసుకురావడం తప్పుకాదు కానీ ఆ ఇంటి యజమానికి అడగకుండా కోసుకోవడం ఓ తప్పు... ఇక కొందరైతే  ఏకంగా చెట్టుకి ఒక్క పువ్వు కూడా ఉంచరు. ఇది మరింత పాపం. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత గానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదంటారు. మరి ఇలాంటి పూజలు చేయడం అవసరమా… ఆలోచించండి...