సావ్‌జీ ఢోలాకియా... ఈ పేరు చాలా మందికి తెలుసు. ఏటా దీపావళి పండుగ సమయంలో తన కంపెనీ ఉద్యోగులకు ఖరీదైన కానుకలు ఇస్తూ వార్తల్లోకి ఎక్కుతారు. కార్లు, నగలు, ఫ్లాట్లు... ఇలా ఖరీదైన కానుకలను ఉద్యోగులకు ఇస్తుంటారు. సూరత్‌కి చెందిన వజ్రాల వ్యాపారి తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ జట్టు పతకం గెలిస్తే ఖరీదైన ఇల్లు లేదా కారు ఇస్తానని ప్రకటించారు.  


ప్రస్తుతం టోక్యో‌లో జరుగుతోన్న ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు పతకాల బాట పడుతున్నారు. ఇప్పటి వరకు మూడు పతకాలు రాగా వాటిలో రెండు అమ్మాయిలు సాధించినవే కావడం విశేషం. భారత మహిళల హాకీ జట్టు కూడా పతక రేసులో ఉంది. సెమీఫైనల్‌‌లో ఓడిన రాణి సేన కాంస్య పోరులో ఎలాగైనా విజయం సాధించి పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే పురుషుల హాకీ జట్టు 41 సంవత్సరాల అనంతరం ఒలింపిక్‌ పతకం సొంతం చేసుకుంది. 


జర్మనీతో జరిగిన పోరులో భారత్ విజయం సాధించి కాంస్యం ముద్దాడింది. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన జర్మనీతో పోరు హోరాహోరీగా జరిగింది. పురుషుల జట్టు విజయం సాధించడంతో ఇప్పుడు మహిళల టీంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో వారిని ప్రోత్సహించేందుకు నగదు ప్రోత్సహకాలు, కానుకలు వెల్లువెత్తుతున్నాయి. 


గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి, హెచ్‌కే గ్రూప్‌ అధినేత సావ్‌జీ ఢోలాకియా అమ్మాయిల హాకీ జట్టుకు వరాలు ప్రకటించారు. ‘మీరు పతకం తీసుకురండి.. మీకు ఇల్లు లేదా కారు ఇస్తా’ అని ప్రకటించారు. అమ్రేలీ జిల్లాలోని ధుహల గ్రామానికి చెందిన ఢోలాకియా హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ ప్రారంభించి ప్రస్తుతం రూ.7 వేల కోట్ల టర్నోవర్‌ సాధించారు. ‘మొదటిసారి మహిళల హాకీ జట్టు సెమీ‌ఫైనల్‌ చేరింది. 130 కోట్ల భారతీయుల కలను వారు  మోస్తున్నారు. నేను వారికి అందించే చిన్న సాయం ఇది. వారి నైతిక సామర్థ్యం పెంపునకు.. ప్రోత్సాహానికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నా’ అని ట్విటర్ వేదికగా సావ్ జీ పేర్కొన్నారు. 






తాను రజత పతక విజేత మీరాబాయి చానును స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. అతి చిన్న ఇంట్లో ఉంటూనే చాను ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. ఈ నేపథ్యంలోనే హాకీ క్రీడాకారులకు రూ.11 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నట్లు ఢోలాకియా ప్రటించారు. ఇల్లు వద్దనుకునే వారికి కారు కొనుగోలు చేసేందుకు రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే తన తమ్ముడి స్నేహితుడు డాక్టర్‌ కమలేశ్‌ దేవ్ పతకం సాధించిన ప్రతి ఒక్క అథ్లెట్‌కి లక్ష రూపాయల నగదు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపారు.