Ganga Dussehra 2023: జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని ‘దశ పాపహర దశమి’ అని పిలుస్తారు. ఈ రోజు గంగామాత అవతరించిన రోజుగా చెబుతారు. అందుకే ఉత్తరాదిన ‘గంగా దశహర గంగోత్సవం’గా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించారు. వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ గాథ.


జ్యైష్ఠమాసే సితే పక్షే దశమ్యాం బుధహస్తయోః|
వ్యతీపాతే గరానన్దే కన్యాచన్ద్రే వృషే రవౌ॥
దశయోగే మహాపుణ్యే గన్ధమాదనపర్వతే|
సేతుబన్ధే మహాదేవం లిఞ్గరూపధరం హరమ్॥
రామో వై స్థాపయామాస శివలిఞ్గమనుత్తమమ్|


అంటే ఈ రోజు గంగా స్నానం, పూజ చేయడం వల్ల దశ విధాలైన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. 


అన్ని పాపాలూ తెలిసే చేయరు..తెలియకుండా చేసినవీ ఉంటాయి. అలాంటి వాటినుంచి వచ్చే దుష్ఫలితాలు అనుభవించకుండా ఉండాలంటే కొన్ని ఉపశమనాలు సూచించాయి మన పురాణాలు. అలాంటి అవకాశమే ‘దశ పాపహర దశమీ వ్రతం’.


Also Read: లక్ష్మీదేవికి 8 రూపాలు ఎందుకు, వాటి వెనుకున్న విశిష్టత ఏంటి!


దశ పాపాలు ఏంటంటే
నిత్య జీవితంలో ఎప్పుడో అప్పుడు ఈ పది రకాల పాపాలు చేస్తారంతా.  అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి.


శరీరం ద్వారా చేసే పాపాలు 3



  • అపాత్రదానం

  • శాస్త్రం అంగీకరించని హింస

  • పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం


నోటి ద్వారా చేసే పాపాలు 4



  • పరుషంగా మాట్లాడడం

  • అసత్యం పలకడం

  • చాడీలు చెప్పడం

  • సమాజం వినలేని భాషను ఉపయోగించడం


మానసికంగా చేసే పాపాలు 3



  • పర ద్రవ్యాన్ని దొంగిలించాలనే దుర్బుద్ధి

  • ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం

  • వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం 


దశపాపహర దశమి రోజు గంగాస్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నింటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. కాశీలో స్నానమాచరిస్తే లభించే ఫలితం అంతా ఇంతా కాదు. అంతా కాశీ వెళ్లలేరు కాబట్టి నది, బావి, చెరువు, సముద్రం ఎక్కడైనా కానీ భక్తి శ్రద్ధలతో స్నానమాచరించాలి. 


Also Read: ఈ 4 వస్తువులను చేతికి అందుకోకూడదు, ఉచితంగా అస్సలు తీసుకోరాదు!


‘మమ ఏతజ్జన్మ జన్మాంతర సమూద్భూత
 దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
 దశహర మహాపర్వ నిమిత్తం స్నాన మహం కరిష్యే!’
 అని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి


దశపాపహర వ్రతం చేయడానికి వీలుకానివారు గంగామాత ద్వాదశనామాలైన ‘నందినీ, నళినీ, సీతా, మాలినీ, మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూతా, గంగా, త్రిపథగామినీ, భాగీరథీ, భోగవతీ, జాహ్నవీ, త్రిదశేశ్వరి’ అనే నామాలను తలచుకుంటూ అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేస్తే గంగానదీ స్నానాన్నీ, వ్రతాన్నీ నిర్వహించినంత ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతోంది. 


అన్ని పుణ్య నదులలో స్నానం చేసినంత ఫలితం రావటానికి  పండితులు ఓ శ్లోకాన్ని చెప్పారు.


గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిథమ్ కురు


నేను పరమపవిత్రమైన గంగ, యమునా, గోదావరి, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరి మొదలైన పుణ్య నదుల నీరు శిరస్సు మీది కురులపై చల్లుకుంటున్నాను అని అర్ధం. ఈ శ్లోకం చదువుతూ ఎవరైతే స్నానం చేస్తూ శిరస్సు మీద నీళ్ళు చల్లుకుంటారో, వాళ్ళు అన్ని నదులలో స్నానం చేసి వచ్చినంత పుణ్య ఫలం దక్కుతుందని చెబితారు.