దశపాపహర దశమి (Dasha Paapa Hara Ganga Dashami 2022)
జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని ‘దశ పాపహర దశమి’ అని పిలుస్తారు. ఈ రోజు గంగామాత అవతరించిన రోజుగా చెబుతారు. అందుకే ఉత్తరాదిన ‘గంగా దశహర గంగోత్సవం’గా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించారు.వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ గాథ.
 
‘‘జ్యేష్ఠమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా
హరతే దశపాపాని తస్మార్దశ హరా స్మృతా!’’
అంటే ఈ రోజు గంగా స్నానం, పూజ చేయడం వల్ల దశ విధాలైన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.


అన్ని పాపాలూ తెలిసే చేయరు..తెలియకుండా చేసినవీ ఉంటాయి. అలాంటి వాటినుంచి వచ్చే దుష్ఫలితాలు అనుభవించకుండా ఉండాలంటే కొన్ని ఉపశమనాలు సూచించాయి మన పురాణాలు. అలాంటి అవకాశమే ‘దశ పాపహర దశమీ వ్రతం’.


దశ పాపాలు ఏంటంటే
నిత్య జీవితంలో ఎప్పుడో అప్పుడు ఈ పది రకాల పాపాలు చేస్తారంతా. అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి.


శారీరకంగా చేసే పాపాలు మూడు



  • అపాత్రదానం

  • శాస్త్రం అంగీకరించని హింస

  • పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం


వాచికంగా (నోటిద్వారా) చేసే పాపాలు నాలుగు



  • పరుషంగా మాట్లాడడం

  • అసత్యం పలకడం

  • చాడీలు చెప్పడం

  • సమాజం వినలేని భాషను ఉపయోగించడం. 


మానసికంగా (మనస్సుద్వారా) చేసే పాపాలు మూడు



  • పర ద్రవ్యాన్ని దొంగిలించాలనే దుర్బుద్ధి

  • ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం

  • వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం 


దశపాపహర దశమి రోజు గంగాస్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నింటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. కాశీలో స్నానమాచరిస్తే లభించే ఫలితం అంతా ఇంతా కాదు. అంతా కాశీ వెళ్లలేరు కాబట్టి నది, బావి, చెరువు, సముద్రం ఎక్కడైనా కానీ భక్తి శ్రద్ధలతో స్నానమాచరించాలి. 


‘‘మమ ఏతజ్జన్మ జన్మాంతర సమూద్భూత
 దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
 దశహర మహాపర్వ నిమిత్తం స్నాన మహం కరిష్యే!’’
 అని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. 


దశపాపహర వ్రతం చేయడానికి వీలుకానివారు గంగామాత ద్వాదశనామాలైన ‘‘నందినీ, నళినీ, సీతా, మాలినీ, మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూతా, గంగా, త్రిపథగామినీ, భాగీరథీ, భోగవతీ, జాహ్నవీ, త్రిదశేశ్వరి’’ అనే నామాలను తలచుకుంటూ అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేస్తే గంగానదీ స్నానాన్నీ, వ్రతాన్నీ నిర్వహించినంత ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతోంది. 


Also Read: ఒక్కో గ్రహానికి ఒక్కో గణపయ్య, మీ ఇంట్లో ఎలాంటి వినాయకుడు ఉన్నాడు!


Also Read:  రాహు మహర్ధశ ప్రభావాన్ని తగ్గించే ఆలయం