YSRCP New Stratagist : ప్రస్తుత రాజకీయాల్లో స్ట్రాటజిస్ట్ లేని రాజకీయ పార్టీ లేదు. ఎన్నికలు వస్తూంటే ఖచ్చితంగా ఓ స్ట్రాటజిస్ట్‌ను పెట్టుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ తో ప్రారంభమైన ఈ ట్రెండ్ ప్రస్తుతం అన్ని పార్టీలకు పాకింది. పీకే శిష్యులు.. ఆయనతో కలిపి ఐ ప్యాక్ సంస్థను నడిపిన వారందరూ ఇప్పుడు సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పీకే సొంత రాజకీయ ఆలోచనలతో స్ట్రాటజీలకు దూరంగా ఉండటంతో ఆయన శిష్యులు ఇతర పార్టీలను తమ క్లైంట్లుగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలోని వైఎస్ార్‌సీపీ కొత్తగా రిషిరాజ్ సింగ్‌ను స్ట్రాటజిస్ట్‌గా నియమించుకుంది. ఒప్పందం చేసుకుంది. ఆయన నేతృత్వంలో ఎమ్మెల్యేలకు తొలి సారిగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు.  


ప్రశాంత్ కిషోర్ తో కలిసి ఐ ప్యాక్‌ను స్థాపించిన వారిలో ఒకరు రిషిరాజ్ సింగ్ !
 
2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత  ప్రశాంత్ కిషోర్ ను స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకుని వైఎస్ఆర్‌సీపీ మంచి ఫలితాలను సాధించింది. ఆయన టీమ్‌పై సీఎం జగన్‌కు ఎంతో నమ్మకం ఉంది.  పీకే ఇప్పుడు ఆయన సొంత రాజకీయం బీహార్‌ లో చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నేరుగా వచ్చి ఇతర పార్టీలకు సేవలు అందించే పరిస్థితుల్లో లేరు. కానీ ఐ ప్యాక్ మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలో రుషిరాజ్‌ సింగ్‌ను జగన్ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఆయన ఏపీలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన టీమ్‌లో కీలక  పాత్ర పోషించారు. ఇప్పుడు నేరుగా స్ట్రాటజిస్ట్‌గా మారారు. 


ఒప్పందం పూర్తి - ఎమ్మెల్యేలకు వర్క్ షాప్ షురూ ! 


రుషిరాజ్ సింగ్ సొంత కంపెనీ పెట్టుకున్నారా లేకపోతే ఐ ప్యాక్‌ లోనే భాగంగా సర్వీస్ అందిస్తున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఒప్పందం కూడా పూర్తయిపోయింది. ఎమ్మెల్యేలకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో సీఎం జగన్ ను కూడా భాగస్వామిని చేస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవల్‌లో వర్క్ పూర్తి చేసిన రిషిరాజ్ టీం... నివేదికలను సిద్ధం చేసింది. వర్క్ షాప్‌లో సూచనలు సలహాను.. సీఎం ద్వారానే ఇప్పించే అవకాశం ఉంది.  


రిషిరాజ్ సింగ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే ?


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన రిషిరాజ్ సింగ్.. అక్కడి ఐఐటీలోనే ఇంజినీరింగ్ పూర్తి చేశారు. రెండేళ్లు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్‌గా పని చేసిన తర్వాత  ప్రశాంత్ కిషోర్‌తో కలిసి సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే సంస్థను ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో మోదీ ప్రచారంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. తర్వాత సంస్థ పేరును ఐ ప్యాక్ అని మార్చారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సంస్థ కార్యకలాపాల నుంచి వైదొలిగారు. రిషి మాత్రం ఏపీలో వైఎస్ఆర్‌సీపీ కోసం పని చేస్తున్నారు.