Janasena Vs BJP :ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల్లో ఉన్న బీజేపీ, జనసేన పార్టీల మధ్య కనిపించని అడ్డుగోడ స్పష్టంగా బయటపడుతోంది. ఏ రాజకీయ కార్యక్రమం అయినా కలిసి చేసి అధికారలోకి రావాలని పొత్తులు పెట్టుకున్న మొదట్లో బాసలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు ఒక పార్టీ పేరును మరో పార్టీ ప్రస్తావించడం లేదు. చాలా కాలం తర్వాత ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..  బీజేపీ రావాలి.. వైఎస్ఆర్‌సీపీ పోవాలి అని నినాదం ఇచ్చారు కానీ.. బీజేపీ - జనసేన రావాలని ఆయన పిలుపునివ్వలేదు. దీంతో రాజకీయంలో ఏదో తేడా కనిపిస్తోందేనన్న చర్చ జరుగుతోంది. 


మిత్రపక్షం గురించి కనీసం ప్రస్తావించని జేపీ నడ్డా ! 
  
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ పోవాలి బీజేపీ రావాలని  జేపీ నడ్డా పిలుపునిచ్చారు. రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆయన ప్రసంగించారు.  బీజేపీ రావాలన్నారు కానీ  బీజేపీ - జనసేన కూటమి రావాలని చెప్పలేదు.  చూస్తూంటే  అసలు బీజేపీతో జనసేన పొత్తులో ఉందా లేదా అన్న సందేహం రావడం ఖాయం. రెండు పార్టీలు ఏం చేసినా కలిసి పనిచేస్తాయన్నట్లుగా మొదట్లో మాట్లాడుకున్నారు. తర్వాత ఎక్కడా కలవలేదు. ఇప్పుడు ఆయనను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారన్న అభిప్రాయం రాజమండ్రి సభతో ఏర్పడింది.  కనీసం జనసేన పును కూడా ఆ పార్టీ అగ్రనేతలు ప్రస్తావించడానికి సిద్ధపడ లేదు. 


జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని నిన్నటి వరకూ చెప్పారు కదా ?


భారతీయ జనతాపార్టీ నేతలు  తాము జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నిన్నటిదాకా చెప్పారు. ఇతర పార్టీలు వస్తే సీట్లిస్తామని పెద్ద పెద్దా డైలాగులే చెప్పారు.  అయితే ఇప్పుడు అనూహ్యంగా జనసేనకూ సీట్లు ఇచ్చే ఉద్దేశంలో వారు లేనట్లుగా కనిపిస్తోంది. అందుకే కనీసం జనసేన ప్రస్తావన తీసుకు రాలేదని అంటున్నారు.   ఇటీవల పవన్ కల్యాణ్‌ ఓట్లు చీలనివ్వబోమని చెప్పిన తర్వాత బీజేపీ నేతలు దూరమవుతున్నట్లుగా కనిపిస్తోంది. జనసేన విస్తృత కార్యవర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ తనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయన్నారు. అందులో జనసేన ఒంటరిగా పోటీ చేయడం,  బీజేపీతో కలిసి పోటీ చేయడం, బీజేపీ,  టీడీపీతో కలిసి పోటీ చేయడం ఉన్నాయన్నారు. ఈ ప్రకటన తర్వాత తాము ఒకే ఆప్షన్‌తో ఉన్నామని బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు జనసేన ప్రస్తావన లేకుండానే రాజకీయం చేస్తున్నారు. 


పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించమన్నారనే కోపమా ?


పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు ఇటీవల డిమాండ్ చేస్తున్నారు. నిజానికి గతంలోనే బీజేపీ పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. తిరుపతి ఉపఎన్నికల సమయంలోనే హైకమాండ్ సూచనలతోనే సోము వీర్రాజు ఈ ప్రకటన చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఈ అంశం ప్రస్తావించలేదు. ఇప్పుడు అలా ప్రకటించే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో జనసేన వర్గాలు నిరాశకు గురవుతున్నాయి. 


ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందా ?


ఇటీవలి కాలంలో రెండు పార్టీల మధ్య పరిస్థితి అంత మంచిగా ఉందని ఎవరూ అనుకోవడం లేదు. తనకు జాతీయ నేతలే తెలుసని..  రాష్ట్ర బీజేపీ నేతలతో పెద్దగా పరిచయం లేదని పవన్ కల్యాణ్ కూడా ప్రకటించారు.అదే సమయంలో తిరుపతి ఉపఎన్నిక , స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య సహకారం పూర్తిగా కొరవడింది.  బద్వేలు ఉపఎన్నిక.. ఇప్పుడు ఆత్మకూరు ఉపఎన్నికతో  వారి మధ్య దూరం మరింత పెరిగినట్లుగా కనిపిస్తోంది. చివరికి అధికారికంగా పొత్తులున్నాయి.. అనధికిరంగా ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.