Pavan Kalyan On Tenth Results : టెన్త్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఫెయిల్ కావడానికి కారణం ఆ విద్యార్థుల తల్లిదండ్రులేనన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ పెద్దలు మాట్లాడటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వ చేతకాని తనం వల్ల విద్యార్థుల భవిష్యత్ నాశనమైపోయిందని.. పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పిల్లల తల్లిదండ్రులపై నెపం నెట్టేసి చేతకాని తనాన్ని ఇప్పటికి దాచి పెట్టుకోవచ్చు కానీ.. చరిత్ర దాచిపెట్టుకోదని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.
నాడు-నేడు పేరుతో చేసిందేంటి ?
నాడు, నేడు పేరుతో రంగులేయించి.. ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్పిస్తామనగానే సరిపోదని బోధనా సిబ్బందిని కూడా నియమించాలన్నారు. నాడు నేడు కోసం పదహారు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు కానీ ఒక్క డీఎస్సీ ప్రకటన కూడా ఇవ్వలేదనేది వాస్తవమన్నారు. పటిష్టమైన విద్యా ప్రణాళికలు ఉండాలని.. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకోవాలని అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.
టీచర్లను వైన్ షాపుల దగ్గర నిలబెట్టిన ఫలితం !
అరకొర ఉన్న ఉపాధ్యాయులను మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబెట్టిన ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మరుగు దొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం ఫోటోలు తీయడం వంటి పనులు అప్పగించి విద్యార్థులకు పాఠాలు చెప్పే అవకాశాన్ని దూరం చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
ఫెయిలయిన వారికి పది గ్రేస్ మార్కులివ్వాలి !
రీ వాల్యూయేషన్ కోసం రూ. ఐదు వందలు కట్టాల్సిందేనని ప్రభుత్వం మరో దోపిడీకి తెర తీసిందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేమీ కుదరదని.. రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజులు ఏమీ తీసుకోవద్దని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఫెయిలయిన విద్యార్థులకు పది గ్రేస్ మార్కులు ఇవ్వాలని.. విద్యార్థుల మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మీ చేతకాని తనాన్ని పిల్లలపై రుద్దవద్దని ఆయన సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.
ఏపీలో టెన్త్ ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణతా శాతం రావడంతో వివాదం ప్రారంభయింది., పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.