Chanakya Niti : ఒక వ్యక్తి ప్రస్తుత లేదా పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితంగానే సుఖ, దుఃఖాలను అనుభవిస్తాడని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి 13వ అధ్యాయం 15వ శ్లోకంలో ఆచార్య చాణక్యుడు, మనిషి అలవాట్ల గురించి వివరించాడు. అలవాట్ల కారణంగానే ఓ వ్యక్తి చేసిన పనిలో ఫలితం పొందుతాడని తెలిపాడు. మానవ జీవితంలోని అనేక సమస్యలకు వారి అలవాట్లే మూల కారణమని స్పష్టంచేశాడు. తన అలవాట్లను అదుపులో ఉంచుకోగలిగిన వారు, సంక్షోభం ఎదురైనప్పుడు కూడా ఆనందాన్ని కోల్పోరని వివరించాడు. అలాకాకుండా అలవాట్లు వ్యక్తిపై ఆధిపత్యం చెలాయిస్తే, అతనికి విజయం చాలా దూరంగా ఉంటుందని.. ఫలితంగా కోరి కష్టాలను తెచ్చుకుంటారని వెల్లడించాడు. జీవితంలో కష్టాలను తెచ్చే అంశాలపై చాణక్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
అనవస్థికాయస్య న జనే న వనే సుఖం ।
జనో దహతి సంఘాద్ వాన్ సగ్వివర్జనాత్ ॥
ఆచార్య చాణక్యుడు తన శ్లోకాల ద్వారా ఒక వ్యక్తి ఎదుర్కొనే సమస్యలకు మూల కారణం అతని మనస్సు అని స్పష్టంగా చెప్పాడు. ఒక వ్యక్తి మనస్సు అదుపులో లేకుంటే, అతను ఎప్పుడూ సంతోషంగా, సంతృప్తిగా ఉండలేడు. ప్రపంచంలోని అన్ని సౌకర్యాలు, సదుపాయాలు అతనికి అందుబాటులో ఉన్నప్పటికీ చంచలమైన మనస్సు ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది. అటువంటి వారు ఏ పని ప్రారంభించినా విజయం సాధించలేరు. మనసును అదుపులో ఉంచుకునే శక్తి లేని వ్యక్తులు పెద్ద కుటుంబంలో ఉన్నా లేక ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండరని చాణక్యుడు చెప్పాడు.
వారికి నిత్యం అసంతృప్తి
చాణక్య నీతి ప్రకారం, మనస్సుపై నియంత్రణ కోల్పోయిన వ్యక్తికి ప్రజల సాంగత్యం బాధ కలిగిస్తుంది. ఎందుకంటే అతను ప్రజల విజయాన్ని చూసి అసూయపడతాడు. అందువల్ల అతను ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. అలాంటి వ్యక్తులు పని చేయాలని కూడా భావించరు. ఫలితంగా వారు చేపట్టే పనులు పూర్తి చేయలేక విఫలమవుతూ ఉంటారు. అదే సమయంలో ఒంటరితనం అతన్ని లోపల నుంచి నాశనం చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉందనే భావన కలుగుతుంది.
లక్ష్య సాధనకు ఈ లక్షణాలు ఉండాలి
మోసం చేసే లక్షణం, చెడు పనులకు పాల్పడే వ్యక్తి సంపదను అనుగ్రహించే లక్ష్మీదేవి కృపకు ఎప్పటికీ పాత్రుడు కాలేడని ఆచార్య చాణక్యుడు స్పష్టంచేశాడు. అంతేకాకుండా అలాంటి వ్యక్తులు తాము ప్రారంభించిన పని పూర్తిచేయలేక లక్ష్యం చేరుకోలేక పరాజయం పొందుతారని తెలిపాడు. లక్ష్యాన్ని సాధించాలంటే సజ్జన సాంగత్యం, క్రమశిక్షణ, మనసుపై నియంత్రణ, సాధించాలనే తపన ఉండాలని సూచించాడు. ఈ లక్షణాలన్నీ ఉంటే సంపదతో పాటు సమాజంలో వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా పెరుగుతుందని వెల్లడించాడు.