Raghava lawrence: సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. వారిలో చాలా మంది కష్టాల్లో ఉన్న ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటారు. అలాంటి వారు టాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లోనూ ఉన్నారు. అయితే కొంత మంది హీరోలు మాత్రం ఎప్పుడూ ఏదొక హెల్ప్ చేస్తూ కనిపిస్తూనే ఉంటారు. అది ఎలాంటి సాయమైనా ముందుండి చేసేస్తుంటారు. అలాంటి హీరోలో రాఘవ లారెన్స్ కూడా ఒకరు. ఆయన ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశారో చెప్పడం కష్టమే. ఇటీవలే 150 మంది పేద పిల్లలను దత్తత తీసుకొని తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆ పిల్లల చదువులకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని ఓ సినిమా ఫంక్షన్ లో ప్రకటించారు దీంతో మంచి మనసుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇది జరిగి కొన్ని రోజులు కూడా గడవక ముందే లారెన్స్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆర్థికంగా చితికిపోయిన ఓ నిర్మాతకు అండగా నిలబడ్డారు లారెన్స్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 


రాఘవ లారెన్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లారెన్స్ తన టాలెంట్ తో ఎంతో మంది పెద్ద హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. అంతే కాదు దర్శకుడిగా, రచయితగా, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అన్ని విభాగాల్లో పట్టు సాధించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు లారెన్స్. ఎంతో మందికి సాయం చేస్తారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ సినీ నిర్మాతకు సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. తమిళ్ లో సూర్య, విక్రమ్ లు నటించిన పితామగన్(శివపుత్రుడు) వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించారు వీఏ దురై. అలాగే రజనీకాంత్, విజయకాంత్, సత్యరాజ్ లతో కూడా ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలు తీశారు. అయితే రజనీకాంత్ తో తెరకెక్కించిన ‘బాబా’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ లు అవ్వడంతో ఆర్థికంగా కుంగిపోయారు దురై. ఆయన ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఎంతో కాలంగా ఆసుపత్రికే పరిమితమయ్యారు. 


ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు ఖర్చుపెట్టలేని స్థితిలో దురై ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న లారెన్స్ వెంటనే స్పందించారు. ఆయన ఆసుపత్రి ఖర్చులకు 3 లక్షల రూపాయలను సాయం చేశారు. అంతకముందు దురై పరిస్థితి తెలిసి సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్య లు కూడా తమ వంతు ఆర్థిక సాయం చేశారు. అలాగే తమిళ దర్శకుడు వెట్రిమారన్ కూడా ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు రాఘవ లారెన్స్ ముందుకొచ్చి ఆర్థిక సాయం చేశారు. దీంతో ఆయనకు ప్రశంసలు అందుతున్నాయి. ఇక రాఘవ లారెన్స్ ఇటీవల వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన తాజాగా నటించిన ‘రుద్రుడు’ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఈ మూవీ తర్వాత లారెన్స్ ‘చంద్రముఖి సీక్వెల్ లోనూ నటించనున్నారు. 


Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?