Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలోని నీటికుంటలో ముగ్గురు విద్యార్థులు ఈతకు దిగారు. ప్రమాదవశాత్తులో నీటికుంటలో ముగిగిపోయి విద్యార్థులు మృతి చెందారు. మృతులు విక్రమ్‌, ఉమామహేశ్, సాయిచరణ్‌గా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  


అసలేం జరిగింది? 


పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పోరేట్‌పల్లికి చెందిన ముగ్గురు మిత్రులు నీటికుంటలో ఈతకు దిగారు. అయితే ప్రమాదవశాత్తు ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. ముగ్గురు విద్యార్థులు పోరేటిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారని స్థానికులు తెలిపారు. మృతులు సాయి చరణ్, ఉమా మహేష్, విక్రమ్‌గా స్థానికులు గుర్తించారు. సాయిచరణ్, ఉమా మహేష్ చెరువులో మునిగిపోయి చనిపోయారు. విక్రమ్ ను చెరువు నుంచి బయటకు తీసిన కాసేపటికి ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలిపారు. సరదాగా ఈతకు వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా పడిఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. ముగ్గురు విద్యార్థులను నీటి కుంట నుంచి బయటకు తీసి గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటే వారు ప్రాణాలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ముగ్గురికీ ఈతరాకపోవడం వల్లే నీటికుంటలో మునిగిపోయారని తెలుస్తోంది. ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.  


ఇటీవల కడపలో


కడప జిల్లా వేంపల్లి మండలంలో ఇటీవల విషాద ఘటన చోటుచేసుకుంది. అలవలపాడులోని గాలేరు నగరి కెనాల్ లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య(25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్‌(8), సాయి తేజ(11) తమ చిన్నారుల మేనమామ శశికుమార్‌ తో కలిసి గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లోకి ఈతకు వెళ్లారు. కాలువ లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మునిగిపోయారు. శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న వేంపల్లి ఎస్సై తిరుపాల్‌ నాయక్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. మృతుల్లో సాయితేజ, సాయి సుశాంత్‌ అక్కాతమ్ముళ్లు కాగా బంధువైన జ్ఞానయ్య ఈస్టర్‌ పండుగకు వీరి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. సాయి, సుశాంత్‌ల అమ్మ చనిపోవడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు.  ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది. 


వేసవికాలం కావడంతో విద్యార్థులు గ్రామాలకు సమీపంలోని చెరువులు, నీటికుంటల్లో ఈతకు దిగుతుంటారు. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈత రానివాళ్లు ఎట్టి పరిస్థితుల్లో చెరువుల్లో, కుంటల్లో దిగవద్దని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థులపై నిఘా పెట్టాలని కోరుతున్నారు.