Wheat Export Ban: గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా దేశీయ మార్కెట్‌లోకి సరఫరా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణం (Inflation in india) పెరగకుండా చూడడానికి కూడా గోధుమల ఎగుమతులపై నిషేధాన్ని కొనసాగించింది. కేంద్ర ఆహారం, వినియోగదారు వ్యవహారాలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఈ మేరకు ప్రకటన చేశారు.
వివిధ రాష్ట్రాల్లో గోధుమల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, తొలి వారంలో సేకరణ గణాంకాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. అకాల వర్షాలు కురిసినా గోధుమల దిగుబడి బాగానే ఉందని వెల్లడించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం తప్పనిసరి కాబట్టి, గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
2022 మే నుంచి కొనసాగుతున్న నిషేధం
ప్రపంచంలో గోధుమలను ఉత్పత్తి చేసే రెండో అతి పెద్ద దేశం భారతదేశం. అయితే, దేశీయ మార్కెట్‌లో గోధుమల అందుబాటులో లేక ధరలు ఒక్కసారిగా పెరగడంతో, గోధుమల ఎగుమతిపై నిషేధం విధిస్తూ 2022 మే నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిషేధాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది.
అకాల వర్షాల కారణంగా గోధుమ పంటకు నష్టం వాటిల్లడంతో, గోధుమల సేకరణల్లో నాణ్యత నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, చండీగఢ్ రాష్ట్రాల్లో రైతులకు కోసం నిబంధనల మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా నీళ్లు నిలిచి గోధుమ పంట దెబ్బతిందని, కాబట్టి పంట కొనుగోళ్లలో నిబంధనలను సడలించాలని రైతులంతా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2023-24 మార్కెటింగ్ సీజన్‌లో, ఏప్రిల్ 10 వరకు 13.20 లక్షల టన్నుల గోధుమలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. పంజాబ్ నుంచి 1000 టన్నులు, హరియాణా నుంచి 88,000 టన్నుల గోధుమలను సేకరించింది. ఈ రాష్ట్రాల్లో మార్కెట్‌లోకి గోధుమలు పెద్దగా రాకపోవడంతో ప్రస్తుతానికి కొనుగోళ్లు తక్కువగా జరిగాయి. రానున్న రోజుల్లో వేగం పుంజుకునే అవకాశం ఉంది.
57 శాతం తగ్గిన గోధుమ నిల్వలు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వెల్లడించిన సమాచారం ప్రకారం... ఆ సంస్థ వద్ద గోధుమ నిల్వలు 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. 2023 ఏప్రిల్ 1 నాటికి, FCI గోదాముల్లో గోధుమల ప్రారంభ నిల్వ 83.45 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గింది. సరిగ్గా ఏడాది క్రితం, 2022 ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా గోడౌన్లలో 189.9 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వ ఉంది. FCI డేటాను బట్టి. 2022 గోధుమల స్టాక్‌ను, ఇప్పటి స్టాక్‌తో పోలిస్తే, ఈ సంవత్సర కాలంలో నిల్వలు 57 శాతం పైగా తగ్గాయని స్పష్టమవుతుంది. 2021 ఏప్రిల్ 1న గోధుమల నిల్వ 273 లక్షల మెట్రిక్ టన్నులు, 2020 ఏప్రిల్ 1న 247 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. గత 10 సంవత్సరాల్లో, 85 లక్షల మెట్రిక్ టన్నుల కంటే తక్కువ గోధుమల నిల్వలు ఉండడం ఇది రెండోసారి. అంతకుముందు 2017లో ఈ పరిస్థితి కనిపించింది.
గత ఏడాది, 2021-22 సీజన్‌లో, 444 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గతేడాది ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గోధుమ పంట దెబ్బతినడంతో ప్రభుత్వం 187.92 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. గత 15 సంవత్సరాలలో ప్రభుత్వ సేకరణలో ఇదే తక్కువ.
ఈ ఏడాదిలో కూడా, ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు పెరగడం, మార్చిలో అకాల వర్షాలు కురిశాయి. వీటివల్ల పెద్దగా నష్టం లేకపోయినా గోధుమ దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఈ రబీ సీజన్‌లో 341.5 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత రబీ సీజన్‌లో 112.18 మిలియన్ల గోధుమలు దిగుబడులు రావచ్చని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా గోధుమల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.
దేశీయ మార్కెట్లో తగినంత సరఫరా ద్వారా గోధుమల ధరలను తగ్గించడం కేంద్ర ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు. గోధుమ నిల్వలు తగ్గడంతో గత ఏడాది కాలంలో ధరలు భారీగా పెరిగాయి. దీంతో, గోధుమ పిండితో చేసిన ఆహార పదార్థాల కూడా ఖరీదయ్యాయి. మరొక్క ఏడాది తర్వాత, 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకునేలోగా, తగినంత సరఫరా ద్వారా దేశీయ మార్కెట్‌లో గోధుమల ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లేకపోతే అటు ప్రత్యర్థి పక్షాల నుంచి విమర్శలు, ఇటు సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొని రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంది.