Chanakya Niti In Telugu: చాణక్యుడి పేరు చెప్పేసరికి గొప్ప రాజకీయ గ్రంథం అర్థశాస్త్రం గుర్తొస్తుంది. అంతేకాదు… తన అపారమైన రాజనీతితో వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి… మగధ సింహాసనంపై చంద్రగుప్తుడిని కూర్చోబెట్టిన అపర మేధావి చాణక్యుడు. నంద వంశ నిర్మూలను మౌర్యవంశ స్థాపనకు కారకుడైన కౌటిల్యుడు కేవలం అర్థశాస్త్రం, రాజనీతిజ్ఞత మాత్రమే కాదు. సుఖ‌మ‌య జీవితానికి పాటించాల్సిన చాలా నియ‌మాల‌ను చెప్పాడు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవిత పురోగమనానికి సంబంధించిన అనేక అంశాల‌ను వెల్ల‌డించాడు. ఆనందం, విచారం జీవితంలో రెండు ముఖ్యమైన భాగాలు. ఆనందాన్ని పంచుకోవడం వల్ల సంతోషం పెరుగుతుంది. బాధను పంచుకోవడం దుఃఖాన్ని తగ్గిస్తుంది. సంతోషకరమైన జీవితానికి చాణక్యుడు అనేక సూత్రాలను తెలిపాడు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలి,  ఎలా ముందుకు సాగాలి అన్న అంశంపై చాణక్యుడు తన అభిప్రాయాలను వివ‌రించాడు. చాణక్యుడు చెప్పినట్లుగా, పరిస్థితి ఎలా ఉన్నా మనకు ధైర్యాన్నిచ్చి, అండగా నిలిచే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురినీ మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడ‌దు. చాణ‌క్యుడు తెలిపిన ఆ ముగ్గురు వ్యక్తులు మన జీవితంలో ఎందుకు అంత‌ ముఖ్య భూమిక పోషిస్తారు? అస‌లు ఆ ముగ్గురు ఎవరో చూద్దాం.


అనుకూల‌వ‌తి అయిన‌ భార్య:


సంస్కారవంతురాలు, సున్నిత మ‌న‌స్త‌త్వం క‌లిగిన‌ భార్య ఉండ‌టం భ‌ర్త‌ అదృష్టానికి సంబంధించిన విషయం. ప్రతికూల పరిస్థితుల్లో భార్య భర్తకు నీడలా నిలుస్తుంది. అంతే కాదు, భర్తకు ఎదురయ్యే ప్రతి క్లిష్ట ప‌రిస్థితినీ దృఢ సంకల్పంతో ఎదుర్కొనేందుకు, ఆ పరిస్థితుల్లో పోరాడే ధైర్యాన్నిస్తుంది. సంక్షోభ సమయాల్లో, ఆమె కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. సున్నిత మనస్కురాలైన‌ భార్య ఉండటం పురుషుని అదృష్టమని చాణక్యుడు చెప్పాడు.


స‌ద్గుణ సంప‌న్నుడైన కుమారుడు:


పిల్లలు తల్లిదండ్రులకు అండగా నిలవాలి. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆశిస్తారు. ఒక కొడుకు ఎప్పుడూ తనతో పాటు తన కుటుంబం పేరును సమాజంలో ప్రకాశింపజేయాలి. పిల్లలకు మొదటి నుంచి సరైన మార్గనిర్దేశం చేస్తే వృద్ధాప్యంలో తల్లిదండ్రుల‌కు వారే తోడుగా ఉంటారు. పిల్లలు చెడు అలవాట్లు అల‌వ‌ర‌చుకోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇలాంటి కొడుకు ఉన్నవారు ఎప్పటికీ దుఃఖించాల్సిన అవసరం లేదు. అలాంటి కొడుకు ఉన్న తల్లిదండ్రులను కష్టకాలంలో ఒంటరిగా వ‌దిలిపెట్ట‌డ‌ని చాణక్యుడు తెలిపాడు.


మంచి స్నేహితుడు:


ఏ వ్యక్తి అయినా తన జీవితంలో చేసే స్నేహం అతని దిశ, స్థితిని నిర్ణయిస్తుంది. మీరు జీవితంలో మంచి వ్యక్తుల సాంగత్యాన్ని పొందినట్లయితే, చాలా పురోగతిని సాధిస్తారు. అంతేకాకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు, ఎందుకంటే అలాంటి వ్యక్తులు మిమ్మల్ని తప్పు మార్గంలో వెళ్ల‌నివ్వరు. వారు నిస్వార్థంగా, ప్ర‌తిఫ‌లాక్ష లేకుండా, నిండు మ‌న‌సుతో మీ క్షేమం కోరుకుంటారు. అలాంటి వ్యక్తుల సహవాసాన్ని ఎప్పుడూ వదులుకోవద్దని.. ఆపద సమయంలో వారు మీకు అండగా ఉంటార‌ని చాణక్యుడు చెప్పాడు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎవరి సాంగ‌త్యాన్ని విడిచిపెట్టకూడదో, ఎవరి సహవాసం చేయకూడదో స్ప‌ష్టంగా పేర్కొన్నాడు. చాణక్యుడు నీతి ప్రకారం, పై ముగ్గురి సహవాసాన్ని మనం ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. వారు మనల్ని ప్రగతిపథంలో నడిపిస్తార‌ని చాణ‌క్యుడు తెలిపాడు.



Also Read:  ఇలాంటి పనులు చేస్తే నవగ్రహాల ఆగ్రహానికి గురికాతప్పదు!