తూర్పు నుండి వీచే గాలులలో ఏర్పడిన ద్రోణి ఈరోజు ఉత్తర కేరళ నుండి అంతర్గత కర్నాటక మరియు మధ్య మహారాష్ట్ర మీదుగా విధర్భ వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో, ఆగ్నేయం నుండి కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయి.


తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు: 
తెలంగాణ రాష్ట్రంలో తదుపరి మూడు రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు  సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది. 


Telangana Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
నేడు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 30 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (Andhra Pradesh State Disaster Management Authority-APSDMA) మంగళవారం 32 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా అనకాపల్లి, అల్లూరి, మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


అల్లూరి సీతారామరాజు జిల్లా ఏడు మండలాల్లో విపరీతమైన వేడిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రత కనిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనకాపల్లి జిల్లాలోని ఐదు మండలాలు, తూర్పుగోదావరిలోని రెండు మండలాలు, కాకినాడలోని ఆరు మండలాలు, పార్వతీపురం జిల్లాలోని ఆరు మండలాల్లో కూడా వడగాలులు వీస్తాయని అప్రమత్తం చేశారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా


ఏప్రిల్ తొలినాళ్లలో మండుతున్న ఎండలు రానున్న రోజుల్లో మరింత మండుటెండలు ఉండొచ్చని సూచిస్తోంది. వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే వారంలో ఉష్ణోగ్రత 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈశాన్య భారతదేశంలో తేలికపాటి వర్షం కనిపించినప్పటికీ ప్రజలు ఏప్రిల్ నెలలోనే మే వేడిని అనుభవించవచ్చు.


40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత
దేశంలోని చాలా ప్రాంతాలు ఉక్కపోతతో, చెమటలతో అల్లాడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో భారతదేశంలోని చాలా ప్రాంతాలు తేమతో కూడిన వేడిని ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. మధ్య భారతదేశం మరియు దాని పరిసర ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ మరియు ఆగ్నేయ భారతదేశం వంటి తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, పాదరసం 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటవచ్చు.


ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, గోవాలో 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీవ్రమైన వేడి ఏర్పడవచ్చు, తెలంగాణ మరియు మహారాష్ట్రలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అయితే, రాబోయే 2-3 రోజులలో ఈ ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులపై ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు.