Buddha Purnima 2023: వైశాఖ పూర్ణిమ..దీనిని మహా వైశాఖి..బుద్ధ పూర్ణిమ అంటారు. బుద్ధుడి జీవితంలో వైశాఖ పూర్ణిమ చాలా ప్రత్యేకం.



  •  పిలవస్తు రాజు శుద్ధోధనుడు - మహామాయలకు సిద్ధార్థుడిగా జన్మించినది  వైశాఖ పౌర్ణమి రోజే

  •  జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడి నుంచి బుద్ధుడిగా మారినది వైశాఖ పౌర్ణణి రోజే

  • బుధ్దుడు నిర్యాణం చెందినది కూడా వైశాఖ పౌర్ణమి రోజే


గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. 


Also Read: బుధుడు-శుక్రుడు కలయికతో అరుదైన యోగం, ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం


బోధి వృక్షానికి  పూజలు


గౌతముని బుద్ధుడిగా మార్చిన బోధి వృక్షానికి పూజచేసే ఆచారం ఆ కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకరోజు ఓ భక్తుడు పూలు తీసుకొస్తాడు.. ఆ సమయంలో గౌతముడు లేకపోవడంతో చాలా సేపు వేచి చూసి నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు. దీనిని గమనించి బేతవన విహారదాత ఆనంద పిండకుడు.. బుద్ధుడు వచ్చిన వెంటనే ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పుడు పూజ సాగేందుకు అక్కడ ఏదైనా వస్తువు ఉంచాల్సిందిగా కోరాడు. విగ్రహారాధనకు అనుమతించని బుద్ధుడు బోధివృక్షానికి పూజలు చేయమని చెప్పాడు. అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు..అప్పడు అదో ఉత్సవంలా సాగింది. కోశల దేశపు రాజు ఏకంగా తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. ఇదంతా జరిగింది కూడా వైశాఖ పౌర్ణమి రోజే అని చెబుతారు.


‘వట సావిత్రి’ వ్రతం ఇదేనా


ఏడాదికి ఓసారి వైశాఖ పౌర్ణమి రోజు బోధివృక్షానికి పూజలు చేయడం ఆచారంగా మారింది. బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమ పూజ ఘనంగా జరుగుతుంది. బోధి వృక్షానికి జెండాలు కట్టి, దీపాలు వెలిగిస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది. రంగూన్, పెగు, మాండలే  ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా, నియమనిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు, దీపాలు, జెండాలు పట్టుకుని ఊరంతా యాత్ర చేసి సాయంత్రానికి కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి, చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే వటసావిత్రి వ్రతం దీన్నుంచి మొదలైందే అని కూడా అంటారు. అయితే వటసావిత్రి వ్రతం వైశాఖ పూర్ణిమకు కాకుండా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజాద్రవ్యాలు తీసుకుని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేస్తారు.


Also Read: మహిళలు వేదం చెప్పేందుకు ఎందుకు అనర్హులు, చెబితే ఏమవుతుంది!


వైశాఖ పౌర్ణమి రోజు ఇలా చేస్తే మంచిది


వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువు ఆరాధించి పూజించడంతో పాటు సంపత్‌ గౌరీ వ్రతాన్ని ఆచరించడం విశేషం. ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. సంపదలు కలగాలనే కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీదేవిని చేసి పూజించి, ఆ పసుపు గౌరీదేవిని ముత్తైదువుకు వాయనం ఇవ్వడం ఈ వ్రతం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజు చేసే దానధర్మాలకు అనేక శుభ ఫలితాలు ఉన్నాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అన్నదానం,  వస్త్రదానం, గొడుగు, చెప్పులు, నీటికుండ వంటివి దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని చెబుతున్నారు పండితులు.