Palnadu News: పల్నాడుజిల్లాలలో టైగర్ టెన్షన్ మొదలైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ అభయారణ్యంలోని పులులు పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయని అధికారులు చెబుతున్నారు. దీంతో జనావాసాల్లోకి వస్తాయనే భయంతో ఉన్నారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేయడంతో మరింక కంగారు పడుతున్నారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో పులుల సంతతి వృద్ధి చెందింది. వాటి సంఖ్య 73కి పెరిగింది. దీంతో అవి తిరిగేందుకు ఆ ప్రాంతం సరిపోవడం లేదు. అందుకే అవి పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి.
దుర్గి, మండలంలోకి రెండు పులులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. బొల్లాపల్లి, కారంపూడి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఇవి మ్యాన్ ఈటర్స్ కావని కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నా ప్రజల్లో మాత్రం భయాందోళన కనిపిస్తున్నాయి. టైగర్స్‌ను ఇబ్బంది పెట్టి వాటిని గందరగోళ పరచొద్దని అధికారులు హితవు పలుకుతున్నారు.
పల్నాడు అటవీ ప్రాంతంలోకి వచ్చిన పులులు జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే సుమారు 45 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉన్నందున కంచె వేసేందుకు వీల్లేదని అంటున్నారు. అందుకే అటవీ జంతువులు గ్రామాల్లోకి రాకుండా పెద్ద పెద్ద గుంతలు తవ్వినట్టు చెబుతున్నారు. అందులో నీళ్లు కూడా పోయిస్తున్నామన్నారు.