బోనం అంటే 


బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యం వండి కుండను పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. ఆ కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, అంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటారు. సంప్రదాయానికి చిహ్నమైన ఈ బోనాన్ని స్త్రీమూర్తులే త‌యారు చేస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాల‌మ్మ, పెద్దమ్మ..గ్రామ దేవతలను తమను చల్లంగా చూడలమ్మా అంటూ వేడుకుంటారు. గ్రామానికి, కుటుంబానికి ఎలాంటి ఆపద రాకూడదని మెుక్కుకుంటారు. కొందరు అమ్మవారికి బోనంతో పాటు సాక సమర్పిస్తారు. చిన్న మట్టిపాత్రలో నీళ్లుపోసి చక్కెర, బెల్లం కలిపి పానకాన్ని తయారు చేస్తారు. ఆ తీర్థంలో వేపకొమ్మలు ఉంచి ,బోనంపై పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 


Also Read: బోనమెత్తిన గోల్కొండ, జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు


వందల ఏళ్ల సంప్రదాయం


వందల ఏళ్ల నుంచి ఈ బోనాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా దీన్ని నిర్వహిస్తుంటారు. పూర్వం కొండ కోనల్లో జీవించే సమయంలో ఓ రాయిని దేవతగా చేసుకుని పూలు, పళ్లు, పసుపు,కుంకుమ, నీళ్లు, పండిన పంట సమర్పించేవారు. అలా  మెుదలైన ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. పల్లవ రాజుల కాలంలో తెలుగు నేల‌పై బోనాల పండుగ ఉండేదని చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవ‌రాలు ఏడు కోల్ల ఎల్లమ్మ న‌వదత్తి ఆల‌యాన్ని నిర్మించి, బోనాలు స‌మ‌ర్పించార‌ట‌. 1676లో క‌రీంన‌గ‌ర్ హుస్నాబాద్‌లో ఎల్లమ్మగుడిని స‌ర్వాయి పాప‌న్న క‌ట్టించాడు. అక్కడ కూడా దేవతకు బోనాలు స‌మ‌ర్పించినట్టు  కైఫీయ‌తుల్లో గౌడ‌నాడులు గ్రంథంలో ఉంది.


భాగ్యనగరంలో ఎప్పటి నుంచి


భాగ్యనగరం విషయానికొస్తే 1869లో జంట‌న‌గ‌రాల్లో ప్లేగు వ్యాధి మ‌హ‌మ్మారి వ్యాపించింది. వేల మంది పిట్టల్లా రాలిపోయారు. అమ్మవారి ఆగ్రహం వల్లే ఇదంతా జరుగుతోందని భావించిన ప్రజలు గ్రామ దేవ‌త‌ల‌ను శాంత‌ప‌రచ‌డానికి ప్లేగు వ్యాధి నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికి బోనాలు చేశారని చెబుతారు. 1675లో గోల్కొండ‌ను పాలించిన ల‌బుల్ హాస‌న్ కుతుబ్ షా ( తానీషా ) కాలంలో బోనం పండుగ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన‌ట్టు కూడా చరిత్ర చెబుతోంది. 


Also Read:  ఆరుద్ర కార్తె ఆరంభం - ఎర్రటి ఈ పురుగులు కనిపిస్తే వానలు మొదలైనట్టే!


సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం


ఆషాడమాసం అంటే రుతుప‌వ‌నాలు ప్రవేశించి వ‌ర్షాలు కురిసే సమయం. ఈ సమయంలో మ‌లేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలుతాయి. వాటితో పాటుగా సీజ‌న‌ల్ వ్యాధులు బాధిస్తాయి. ఈ వ్యాధుల నివారణకు కూడా బోనాలు సహకరిస్తాయి. వేప ఆకు క్రిమినాశినిగా ప‌నిచేస్తుంది. అందుకే రోగ నిరోధ‌క‌త కోస‌మే ఇంటికి వేప తోర‌ణాలు క‌డ‌తారు. బోనం కుండ‌కు వేప ఆకులు కడతారు. బోనం ఎత్తుకున్న మ‌హిళలు వేప ఆకులు ప‌ట్టుకుంటారు. ప‌సుపు నీళ్లు చల్లుతారు. 


పోతురాజులు, శివసత్తులు ప్రత్యేక ఆకర్షణ
బోనాల పండుగ  ఊరేగింపులో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గ్రామ దేవతలైన ఓరుగంటి రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఏడుగురు అక్కచెల్లెల్లకు ఒక్కగానొక్క తమ్ముడు పోతురాజు.


భక్తికి భక్తి ఆరోగ్యానికి ఆరోగ్యం బోనాలు పండుగ..