లోకం రీతి ఎలా ఉంటుంది, మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పే మహాభారతంలో అత్యంత శక్తివంతమైన, ప్రధానమైన వ్యక్తి భీష్ముడు. కురుక్షేత్ర యుద్ధంలో గాయపడి.. అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన ధర్మరాజుకి ... మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను కథల రూపంలో చెప్పాడు. లౌక్యం గురించీ, రాజ్యపాలన గురించీ చేసిన ఉపదేశాలు కాలం మారినా విలువని మాత్రం కోల్పోలేదు. రాజ ధర్మం, రాజనీతి , పాలన గురించి చేసిన హితభోధల్లో భాగంగా చెప్పిన చిలుక కథ ఇప్పటి తరానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
భీష్ముడు చెప్పిన చిలుక కథ
‘‘ధర్మారాజా! విను.. బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు. తనకి ఓ చిలుక మీద ఎంతో అభిమానం ఉండేది. కాలక్రమేణా మంచి స్నేహంగా మారింది. కొంత కాలానికి ఆ చిలుకకు కుమారుడు కలిగాడు. ఆ చిన్నారి చిలుకతో బ్రహ్మదత్తుడి కుమారుడు ఆడుకునేవాడు. ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుతున్న రాజకుమారుడికి ఎందుకో దాని మీద కోపం వచ్చి చంపేశాడు. అది చూసిన తల్లి చిలుక కోపాన్ని అణచుకోలేకపోయింది. వెంటనే తన గోళ్లతో రాజకుమారుడి కళ్లని పొడిచింది. ఆ తర్వాత నేరుగా రాజు దగ్గరకు వెళ్లి ‘రాజా! నీ కుమారుడు నా కొడుకుని చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతణ్ని గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇకమీదట నేను ఇక్కడ ఉండలేను. సెలవు!’అని చెప్పింది. అప్పుడు చిలుకతో రాజు .. నువ్వన్నది నిజమే. జరిగినదానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కనుక తగిన ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..? జరిగినదేదో జరిగిపోయింది. దయచేసి ఇకమీదట కూడా నాతో స్నేహంగా ఉండు,’ అంటూ అర్థించాడు. స్పందించిన చిలుక ‘రాజా! నేను నీ కుమారుడిని అంధుడిని చేశాను.. కనుక నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. పగ నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది.
- ఇతరుల భూమిని చేజిక్కించుకోవడం
- అన్నదమ్ముల మధ్య ఆస్తితగాదాలు
- ఆడవారి మధ్య మాటామాటా పెరగడం
- ఎదుటివారి మనసుని గాయపరచడం
అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే వాటికి అంతమంటూ ఉండదు. అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. నేను నీ కొడుకుకి హాని తలపెట్టాను కనుక నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది. అందుకనే నీ తీయని మాటలని విని నేను ఇక్కడ ఉండలేనని చెప్పి చిలుక ఎగిరిపోతుంది.
Also Read: త్యాగం, శీలం, శౌర్యం, నీతి, నియమం, నిష్టలో భీష్ముడికి సరిలేరెవ్వరూ
ఓ ధర్మరాజా రాజనేవాడు ( నేటి జనరేషన్లో ఎవ్వరైనా) ఆ చిలుకలాగా తన జాగ్రత్తలో తనుండాలి. ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. సుతిమెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తనుండాలి. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు. వ్యసనాలలో పడి విచక్షణను మర్చిపోకూడదు. అనుకున్న పని పూర్తయ్యే వరకూ రహస్యాన్ని బయటపెట్టకూడదు.
'పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ…ఈ మూడింటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకమే' అని ముగించాడు భీష్ముడు.
Also Read: వైభవంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం