భీష్మ జననం
ఒకరోజు శంతన మహారాజు గంగా నదీ పరిసర ప్రాంతాల్లో విహరించుచుండగా ఒక అందమైన కన్యను చూశాడు. పెళ్లిచేసుకోవాలని ఆమెను కోరగా... తాను ఏం చేసినా ఎదురు చెప్పకుండా ఉంటే వివాహం చేసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పింది. అందుకు ఒప్పుకున్న శంతనుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఒక పుత్రునికి జన్మనిచ్చి ఆశిశువుని తీసుకెళ్లి గంగా గర్భంలో వదిలేసింది. ఆమె పెట్టిన షరతు గుర్తొచ్చి శంతనుడు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. ఇలా ఏడుగురు పుత్రులను గంగలో వదిలి పెట్టింది. ఎనిమిదవ శిశువును కూడా గంగలో వదిలేసేందుకు ప్రయత్నించగా కుతూహలం ఆపుకోలేని శంతనుడు ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దాంతో ఆమె షరతుకు భంగం కలిగి ఎనిమిదవ శిశువును శంతనుడి చేతిలో పెట్టి వెళ్లిపోయింది. ఆ శిశువే దేవవ్రవతుడు ..ఆ తర్వాత భీష్ముడిగా పేరొందాడు.
Also Read: తొలిచూపులోనే భీముడితో ప్రేమలో పడిన హిడింబి
శీలంలోనూ, శౌర్యంలోనూ, నీతిలోనూ, నిష్ఠలోనూ భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచీ ఆయన త్యాగపురుషుడే. తండ్రి కోసం సర్వసుఖాన్ని, రాజ్యాన్ని వదులుకున్నాడు. కొంత కాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారే మో అన్న అనుమానం వెలిబుచ్చిన తండ్రి కోసం ఏకంగా వివాహాన్నే వద్దనుకున్నాడు. తన తమ్ములు చనిపోయిన తర్వాత కూడా భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీ దేవి స్వయంగా ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు.
58 రోజులు అంపశయ్యపై
అష్టమనువుల్లో ఒకరిగా, శౌర్యప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన, కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉంటాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని గుర్తించగలిగిన అతికొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి రాకను చూసి అమితానందం పొందిన భీష్ణుడు శ్రీమన్నారయణుడిని వేయి నామాలతో కీర్తించాడు. అవే విష్ణుసహస్రనామాలు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం.అలా తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు. భారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అందుకే భీష్మ ఏకాదశి రోజు విష్ణుసహస్ర నామాలు పారాయణం చేస్తే మంచిది.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
మాఘ శుద్ధ అష్టమినాడు భీష్ముడు పరమపదించాడు. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని "భీష్మ ఏకాదశి", "మహాఫల ఏకాదశి", "జయ ఏకాదశి" అని అంటారు. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్రదోషాలు ఉన్నవారుకూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే అన్నింటి నుంచి విముక్తి పొందుతారని విశ్వాసం. విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపొతే కనీసం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అనే శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది అని వివరించాడు భీష్ముడు.