హైదరాబాద్‌లో నటుడు మోహన్‌బాబుతో(Mohan babu)తో సమావేశం అవ్వడంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మోహన్ బాబుతో తనకు 2002-03 టైం నుంచి సాన్నిహిత్యం ఉందన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం జరిగిందని, ఆ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నప్పుడు మోహన్ బాబు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లానని మంత్రి పేర్ని నాని అన్నారు. సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీకి తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ పిలిచి ఉంటే తాను వచ్చేవాడినని మోహన్ బాబు అన్నారన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ కు తెలపమన్నారన్నారు. అంతేతప్ప ఏపీ ప్రభుత్వం తరఫున సంజాయిషీ ఇచ్చేందుకు కాదని  పేర్ని నాని అన్నారు. ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు. మోహన్ బాబు ఇంటి నుంచి తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న మంచు విష్ణు(Manchu Vishnu) శాలువాతో కప్పారని మంత్రి అన్నారు. మంచు విష్ణు చేసిన ట్వీట్ వల్ల మీడియాలో వార్తలు వచ్చాయని తెలిసిందన్నారు. తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఆ ట్వీట్ అప్డేట్ చేసినట్లు వెల్లడించారని మంత్రి తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన సినిమావాళ్లకు వైసీపీ సభ్యత్వం ఉందా మంత్రి పేర్ని నాని(Minister Perni Nani) అన్నారు. నిన్నటి భేటీపై ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. 



ట్వీట్ దుమారం 


గురువారం చిరంజీవి(Chirajeevi) బృందం అమరావతికి వచ్చి సీఎం జగన్‌తో నిర్వహించిన చర్చల సారాంశాన్ని పేర్ని నాని మోహన్‌బాబుకు(Mohan Babu) వివరించినట్లు అర్థం వచ్చేలా మంచు విష్ణు ట్వీట్ చేశారు. సినిమా టికెట్ల రేట్లకు సంబంధించిన వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు, ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ కోసం చేస్తున్న ప్రయత్నాలు వివరించారన్న ఉద్దేశంలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై పెద్ద దుమారం రేగింది. టాలీవుడ్ టాప్ హీరోలు సీఎం జగన్ ను కలిస్తే ప్రభుత్వ ప్రతినిధి మోహన్ బాబు కలిసి వివరణ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై బాగా ట్రోల్స్ వచ్చాయి. 


మంచు విష్ణు అసంతృప్తి!


చిరంజీవి బృందం నుంచి మోహన్ బాబుకు ఆహ్వానం అందకపోవడతో మా అధ్యక్షుడు(MAA President) మంచు విష్ణు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఓ ట్వీట్ చేసి డిలీట్ చేశారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో సీఎం జగన్‌తో జరిగిన చర్చల్లో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు కూడా ఎవరూ లేరు. ఈ క్రమంలో మోహన్‌బాబు అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా పేర్ని నాని హైదరాబాద్‌కు వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని మోహన్ బాబు ఆహ్వానం మేరకు తాను ఆయన ఇంటికి వెళ్లినట్లు మంత్రి పేర్ని నాని అన్నారు.