ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంచేందుకు సర్కార్(AP Govt)కొత్తగా ఏర్పడే జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ధర‌ల‌ను సవరించేందుకు వైసీపీ ప్రభుత్వం అధికారుల‌కు సూచ‌న‌లు ఇచ్చింది. ఈ మెత్తం ప‌రిణామాల‌న్నింటిని వారం రోజుల వ్యవ‌ధిలోనే పూర్తిచేయాల‌ని ఆదేశాలు అందినట్లు సమాచారం. విలువల సవరణ పేరుతో  కొత్త రిజిస్ట్రేషన్(New Registration Charges) ధర‌ల‌ను సిద్ధం చేయాలని జిల్లా యాంత్రాంగానికి సూచనలు చేశారు. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో భూములు, స్థలాలు, భవనాల విలువల సవరణకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. కొత్త జిల్లాల ప్రధాన కేంద్రాలు, ద‌గ్గరా ఉండే ప్రాంతాలు, గ్రామాల్లో భూముల రేట్లు పెంచేందుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్దేశించింది. 


రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాలు 


ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి. రామకృష్ణ డీఐజీలు, డీఆర్ లు, సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీచేశారు. తక్షణం రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నెల 13వ తేదీ నాటికి విలువల పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసి, 14వ తేదీన సంబంధిత కమిటీల ఆమోదం తీసుకోవాలన్నారు. 15న రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేసి 17న రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. ఛార్జీల పెంపుపై అభ్యంతరాలు స్వీకరించాలని తెలిపారు. 18న అభ్యంతరాలు పరిష్కరించి, 19న తుది ఆమోదం పొందాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జీతాలు, సంక్షేమ ప‌థకాల‌కు(Welfare Schemes) కూడా అప్పులు చేయ‌టం, ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టుకోవ‌టం వంటి చ‌ర్యల‌తో ప్రభుత్వంపై వ‌త్తిడి పెరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆద‌ాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జిల్లాల ఏర్పాటు చేసి, భూముల రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను(Land Registration Charges) పెంచుకోవ‌టం ద్వారా ఆదాయాన్ని స‌మ‌కూర్చుకోవాల‌ని స‌ర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో భూముల ధర‌ల పెరుగుద‌ల అంశం మ‌రోసారి తెర మీద‌కు వ‌చ్చింది. ప్రస్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో రియ‌ల్ ఎస్టెట్ రంగం అంతంత మాత్రంగానే ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ధర‌ల పెరుగుద‌ల అంశం ఎంత వ‌ర‌కు ప్రభుత్వానికి ఆదాయాన్ని స‌మ‌కూర్చుతుంద‌నేది ప్రశ్నార్దకంగా మారింది.


ఇప్పటికే పెరిగిన భూముల ధరలు


ఏపీలో కొత్తగా మరో 13 జిల్లాలు(AP New Districts) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాలు, వాటి కేంద్రాలు వస్తుండటంతో రాష్ట్రంలో భూముల ధరలకు పెరుగుతున్నాయి. కొత్త ఆస్తుల విలువలను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొన్నిచోట్ల ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి. ఈ డిమాండ్ ను ఆదాయంగా మార్చుకనేందుకు ప్రభుత్వం కూడా ఆస్తుల విలువను పెంచేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆస్తుల విలువలు అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఆస్తుల విలువను బట్టి రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో కొంత మేర ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది.