IND vs WI, 3rd ODI: వెస్టిండీస్‌తో మూడో వన్డేలో టీమ్‌ఇండియా ఫర్వాలేదనిపించింది. కష్టతరమైన పిచ్‌లో కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కొని గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (80; 111 బంతుల్లో 9x4), రిషభ్ పంత్‌ (56; 54 బంతుల్లో 6x4, 1x6) అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో ప్రత్యర్థికి 266 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఆఖర్లో దీపక్‌ చాహర్‌ (38; 38 బంతుల్లో 4x4, 2x6), వాషింగ్టన్‌ సుందర్‌ (33; 34 బంతుల్లో 2x4, 1x6) బ్యాటుతో మెరిశారు. విండీస్‌ బౌలర్లలో జేసన్ హోల్డర్‌ 4, అల్జారీ జోసెఫ్‌, హెడేన్‌ వాల్ష్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.


టాప్‌ ఆర్డర్‌ విఫలం


నామమాత్రపు వన్డే కావడంతో టీమ్‌ఇండియా మార్పులు చేసింది. రిజర్వు బెంచీ సామర్థ్యాన్ని పరీక్షించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. పిచ్‌ అదనపు వేగం, బౌన్స్‌కు సహకరించడంతో విండీస్‌ పేసర్లు షార్ట్‌ పిచ్‌ బంతులతో పరీక్షించారు. దాంతో జట్టు స్కోరు 16 వద్ద కెప్టెన్‌ రోహిత్ శర్మ (13), మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (0) జోసెఫ్‌ వేసిన ఒకే ఓవర్లో ఔటయ్యారు. ఓడీన్‌ స్మిత్ వేసిన 9.3వ బంతికి శిఖర్ ధావన్‌ (10) సైతం ఔటవ్వడంతో పవర్‌ప్లేలో హిట్‌మ్యాన్‌ సేన 42కే 3 వికెట్లు చేజార్చుకొని ఇబ్బంది పడింది.


పంత్‌, అయ్యర్‌ కీలక భాగస్వామ్యం


కష్టాల్లో పడ్డ టీమ్‌ఇండియాను శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer), రిషభ్ పంత్‌ (Rishabh Pant) ఆదుకున్నారు. వేగంగా వస్తున్న బంతులను గౌరవించారు. సింగిల్స్‌ తీస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. స్పిన్‌ బౌలర్లు రాగానే ఎదురుదాడికి దిగి బౌండరీలు సాధించారు. ఈ క్రమంలో మొదట శ్రేయస్‌ అర్ధశతకం అందుకున్నాడు. అతడితో పాటు రిషభ్ పంత్‌ సైతం హాఫ్‌ సెంచరీ చేయడంతో 30 ఓవర్లకు భారత్‌ 150తో నిలిచింది. ఈ ఇద్దరు మిత్రులు కలిసి నాలుగో వికెట్‌కు 124 బంతుల్లో 110 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే జట్టు స్కోరు 152 వద్ద పంత్‌ను ఔట్‌చేయడం ద్వారా ఈ జోడీని వాల్ష్‌ విడదీశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ (6) నిరాశపరిచినా దీపక్‌ చాహర్‌ (Deepak chahar), వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) సమయోచితంగా ఆడారు. బౌండరీలు బాదారు. మెరుగైన స్కోరు అందించారు.