సగ్గుబియ్యం ఒకప్పుడు బాగా వాడుకలో ఉండేవి. కానీ ఇప్పుడు వాటితో ఏం వండాలో చాలా మందికి తెలియక వాటిని కొనడమే మానేస్తున్నారు. నిజానికి వాటితో ఎన్నో రకాల మంచి వంటలు వండుకోవచ్చు. టేస్టీగా ఉండడమే కాదు శక్తిని కూడా ఇస్తాయవి. 


సగ్గుబియ్యాన్ని కర్రపెండలంతో తయారుచేస్తారు. వీటితో పాయసం, ఉప్మా, గారెలు చేస్తుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఎలాంటి రసాయనాలు కలపని సహజమైన తీపిదనం దీనిలో ఉంటుంది. అందుకే దీంతో చేసిన పాయసానికి చాలా రుచి వస్తుంది. వీటిని చాలా దేశాల్లో సాగో అని పిలుస్తారు. మన దగ్గర మాత్రం సాబుదానా అంటుంటారు. 


ఈ గింజల్లో క్యాల్సియం అధికంగా ఉంటుంది. పాలు, పెరుగు తరువాత కాల్షియానికి మంచి వనరు సగ్గుబియ్యమే. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తంలోని కొవ్వుశాతాన్ని కూడా తగ్గిస్తుంది. వీటిలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. అలాగే గుండె సంబంధ వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. కండరాలు ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. ప్రొటీన్స్ కూడా నిండుగా ఉంటాయి.  వీటిని రోజూ తిన్నా మంచిదే. అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకుంటే రోజంగా శక్తిమంతంగా ఉంటారు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ కె వంటివి అధికంగా ఉంటాయి. 


సగ్గుబియ్యం గారెల రెసిపీ
కావాల్సిన పదార్థాలు


సగ్గుబియ్యం - ఒక కప్పు
ఆలు గడ్డలు - రెండు (మీడియం సైజువి)
పల్లీలు - సగం కప్పు
కొత్తిమీర తురుము - రెండు టీస్పూనులు
పచ్చిమిర్చి తురుము - రెండు టీస్పూనులు
అల్లం తురుము - ఒక టీస్పూను
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా


తయారీ
1. సగ్గుబియ్యాని ముందు రోజు రాత్రే నానబెట్టాలి. ఉదయాన నీటిని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 
2. బంగాళాదుంపల్ని ఉడికించాలి. పల్లీలను ఓసారి మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. 
3. ఓ గిన్నెలోని సగ్గుబియ్యం, బంగాళాదుంపలు, పల్లీల పొడి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉప్పు కాస్త నీరు వేసి బాగా కలపాలి. 
4. కళాయిలో నూనె వేసి బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు సగ్గుబియ్యం మిశ్రమాన్ని గారెల్లా వత్తుకుని మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసుకోవాలి. 
5. బంగారు వర్ణంలోకి వేగాక తీసేస్తే సరి. సగ్గుబియ్యం గారెలు సిద్ధమైనట్టే. 


Also Read: చక్కెర తక్కువ ఆహారాలు ఇవిగో, వీటిని లాగించేయండి ఏ సమస్యా ఉండదు


Also Read: మరణం తరువాత జీవితం ఉంటుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?