చుట్టూ చక్కెర అధికంగా ఉండే ఆహారాలే కనిపిస్తున్నప్పుడు మధుమేహవ్యాధిగ్రస్తులకు ఏం తినాలో అర్థం కాదు. వారు చక్కెర అధికంగా ఉన్న ఆహారం తింటే సమస్యలు అధికమవుతాయి. అందుకే వారికి ఏ ఆహారాల్లో చక్కెర శాతం తక్కువ ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వాటిని  తినడం ద్వారా పోషకాలను కూడా పొందొచ్చు. 


క్యారెట్లు
ఇవి చలికాలంలో అధికంగా లభిస్తాయి. రోజు వారీ ఆహారంలో తినాల్సిన ముఖ్యమైన ఆహారాల్లో ఇవీ ఒకటి. వందగ్రాముల క్యారెట్లలో 4.7 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి ఒకటి లేదా రెండు క్యారెట్లు తినడం వల్ల శరీరంలో చేరే చక్కెర చాలా తక్కువ. దీన్ని కూరగా, స్మూతీగా, జ్యూస్ గా కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. 


కీరాదోసలు
ఇవి వేసవి కాలంలో చాలా మేలు చేస్తాయి. వడదెబ్బ నుంచి కాపాడతాయి.  వేసవి కాలంలో డయాబెటిస్ రోగులు హ్యాపీగా వీటిని తినొచ్చు. వీటిలో చక్కెర, కార్బోహైడ్రేట్లు, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి కీరాదోసలు మధుమేహులకు చాలా సురక్షితం. ఇందులో తక్కువ కొవ్వు, క్యాలెరీలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తాయి. 


బ్రౌన్ రైస్
సాధారణ బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్ డయాబెటిక్ వారికి చాలా సురక్షితం. 100 గ్రాముల బ్రౌన్ రైస్లో కేవలం 0.9గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే తెల్లబియ్యానికి బదులు వీటినే తినమని వైద్యులు సలహా ఇస్తారు. అంతేకాదు బ్రౌన్ రైస్ బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. 


గ్రీకు యోగర్ట్
పెరుగుతోనే దీన్ని తయారు చేస్తారు. సాధారణ పెరుగుతో పోలిస్తే చక్కెర, కొవ్వు రెండూ తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల గ్రీకు యోగర్ట్ లో 3.2 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి తిన్నా అధికంగా చక్కెర శరీరంలో చేరుతుందన్న భయం లేదు. 


పుట్టగొడుగులు
పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు అధికం. వీటిలో చక్కెర తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉంటుంది. డయాబెటిక్ రోగులకు ఆదర్శవంతమైన ఆహారం ఇది. వందగ్రాములు తెల్ల పుట్టగొడుగులు తింటే కేవలం రెండు గ్రాముల చక్కెర మాత్రమే  శరీరంలో చేరుతుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు అందబాటులో ఉనక్న రకరకాల పుట్టగొడుగులను వండుకుని తినవచ్చు.   


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.



Also Read: మరణం తరువాత జీవితం ఉంటుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?