"పుట్టినవానికి మరణం తప్పదు.. మరణించినవానికి పుట్టుక తప్పదు. అందుకే, తప్పించడానికి వీలులేని దాని విషయంలో నీవు దుఃఖించడం తగదు"- భగవద్గీత
ప్రాచీన భారతంలో మరణం, మరణానంతర జీవితం, పునర్జన్మలపై ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. మరణించిన వాడు ఏదో ఒక జీవి రూపంలో తిరిగి పునర్జన్మ ఎత్తుతాడనే నమ్మకంతో ఎంతో మంది ఉన్నారు. మరికొంతమంది మరణానంతర జీవితంపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. శరీరం మాత్రమే చనిపోతుందని, ఆత్మ సంచరిస్తుందని కూడా విశ్వసిస్తారు. అయితే ఈ విషయంలో సైన్సు ఏం చెబుతోంది, శాస్త్రవేత్తలు మరణానంతర జీవితంపై ఏవైనా ఆధారాలు కనుక్కున్నారా? శరీరం ప్రాణం కోల్పోయాక కూడా తరువాతి జీవితమంటూ మనిషికి ఉంటుందా? దీనిపై ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు చేశారు సైంటిస్టులు.
సైన్సు చెప్పింది ఇదే...
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కాస్మోలజిస్ట్, ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు సీన్ కారోల్. ఆయన ఎన్నో ఏళ్లుగా మరణానంతర జీవితంపై పరిశోధనలు చేశారు. సీన్ కారోల్ యూకే లోని ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో మరణానంతర జీవితంపై కొన్నినిజాలు వెల్లడించారు. మరణానంతరం జీవితం ఉంటుందనే విషయం పూర్తిగా అబద్దమని అన్నారాయన. సైన్స్ కొత్త మందులు, విమాన ప్రయాణాలు, ఇంటర్నెట్ వంటి ఎన్నో టెక్నాలజీ సంబంధిత బహుమతులను అందించింది. కానీ మరణానంతరం జీవితం ఉందని మాత్రం సైన్సు చెప్పడం లేదని అన్నారు సీన్ కారోల్. ఈ భూతలంపై బతికున్నంత కాలమే జీవితాన్ని కొనసాగించాలనే నిజాన్ని అర్థం చేసుకోవాలని తెలిపారాయన.
మరణానంతరం జీవితం ఉండాలంటే మన భౌతిక శరీరం నుంచి స్పృహ (consciousness) అనేదాన్ని పూర్తిగా వేరుచేయాలి అని వివరించారు సీన్ కారోల్. మన శరీరాలు భౌతికంగా మరణించినా, వాటి పరమాణువుల్లో ఏదో ఒక రకమైన స్పృహ కొనసాగుతుందనే వాదనలు భారీగా ఉన్నాయి. అయితే రోజువారీగా మన జీవితంలో అంతర్లీనంగా ఉన్న భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం చూస్తే... మనం చనిపోయాక కూడా మన మెదడులో నిల్వ ఉన్న సమాచారాన్ని కొనసాగించేందుకు మాత్రం ఎటువంటి మార్గం లేదు. అంటే సైన్సు ప్రకారం మరణానంతర జీవితం అసాధ్యమని చెబుతున్నారు సీన్ కారోల్.
సైన్సుకు, సాంప్రదాయపు నమ్మకాలకు చాలా దూరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: కన్నబిడ్డను ముట్టుకుంటే అలెర్జీ, ఈ తల్లి పరిస్థితి ఎవరికీ రాకూడదు
Also Read: మీ ఫ్రిజ్‌లో ఉండే ఈ డ్రింకులు వల్ల గుండె పోటు వచ్చే అవకాశం, హార్వర్డ్ పరిశోధన ఫలితం