పాతికేళ్ల వయసుకే గుండెపోటు వచ్చేస్తోంది. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటితే కాని గుండె జబ్బులు బయటపడేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒత్తిడిమయమైన జీవితం, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల గుండె సంబంధ వ్యాధులు కలుగుతున్నాయి. అందుకే చిన్న వయసు నుంచే అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఇలాంటి డ్రింకులు
చాలా మంది వ్యాయామాల కోసం జిమ్ బాట పడుతున్నారు. అక్కడ మితిమీరి వ్యాయామం చేసి, వెంటనే ఎనర్జీ డ్రికులు తాగుతున్నారు. మితిమీరిన వ్యాయామం వల్లే చాలా నష్టం జరుగుతుందనుకుంటే, ఆ వెంటనే తాగే ఎనర్జీ డ్రింకులు ఇంకా హాని చేస్తున్నాయి. ఎనర్జీ డ్రింక్స్ తాగే వారి సంఖ్య ఈ మధ్య మరీ పెరిగిపోయింది. ఫ్రిజ్ తెరిస్తే చాలు కచ్చితంగా కనిపించే జాబితాలో ఎనర్జీ డ్రింకులు, కూల్ డ్రింకులు చేరిపోయాయి. వీటిని రోజూ తాగే వారు ఎంతో మంది ఉన్నారు. వీటి వల్ల గుండె పోటు వచ్చే అవకాశం మరింత పెరుగుతుందని చెబుతోంది హార్వర్డ్ అధ్యయనం.
అధిక మొత్తంలో కెఫీన్
ఎనర్జీ డ్రింకులలో అధికమొత్తంలో కెఫీన్ ఉంటుంది. ఒక బాటిల్ డ్రింకులో 200 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. ఇది ఎంత ఎక్కువో మీరే ఊహించుకోవచ్చు. ఇంత ఎక్కువ కెఫీన్ శరీరంలోకి చేరితే లోపల చాలా మార్పులు జరుగుతాయి. అవయవాలపై ఎంతో భారం పడుతుంది. కొందరు రోజులో రెండు బాటిళ్లకు మించి తాగుతారు కూడా. అలాంటి వారిలో కెఫీన్ శరీరంలో పేరుకుపోతుంది. దాని ప్రభావం గుండె పనితీరుపై పడుతుంది. గుండె కొట్టుకునే వేగంపై ప్రభావం పడుతుంది. దీన్ని arrhythmia అంటారు. కెఫీన్ అధికమవ్వడం వల్ల ఇది కలుగుతుంది. ఈ ఆరోగ్యస్థితిలో గుండె అత్యధిక వేగంతో కొట్టుకోవడం లేదా మెల్లగా కొట్టుకోవడం జరుగుతుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో విద్యుత్ ప్రవాహంలో కూడా తేడా వస్తుంది. చివరికి ఈ స్థితి కార్డియాక్ అరెస్టు లేదా గుండె పోటుకు కారణమవుతుంది. అందుకే యువత ఎనర్జీ డ్రింకులను తాగడం తగ్గించమని సూచిస్తున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. దీంతో పాటూ ధూమపానం, మద్యపానం అలవాట్లను కూడా వదిలిపెట్టాలి. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని కూడా తగ్గించుకోమని సూచిస్తున్నారు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also Read: కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే రక్తపోటు పెరిగే ప్రమాదం?
Also Read: అంకాపూర్ చికెన్ కర్రీ ఇంట్లోనే ఇలా చేసుకోండి, వండుతుంటేనే నోరూరిపోవడం ఖాయం