కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఓ స్టైల్. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎక్కువ మంది ఇదే స్టైల్‌ను పాటిస్తారు చాలా మంది. అలా కాసేపు కూర్చుంటే ఫర్వాలేదు కానీ గంటల తరబడి కూర్చుంటే మాత్రం అనే ఆరోగ్యసమస్యలు మొదలవుతాయి. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని తెలియజేశాయి. చాలా సేపు ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల కాలు, పాదం వంటివి మొద్దుబారడం సహజం. ఇలా జరగడానికి కారణం మోకాలి వెనుక భాగంలో ఉన్న పెరోనియల్ నరాలు. ఈ నరాలపై ఒత్తిడి పడడం వల్ల కాలు తిమ్మిరెక్కడ, కాసేపు స్పర్శ కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఇలా రోజూ గంటలు గంటలు ఒకే స్థితిలో కూర్చుంటే మాత్రం ‘ఫుట్ డ్రాప్’అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి వస్తే కాలి వేళ్లను, కాలు ముందు భాగాన్ని కదిలించలేరు. అయితే కాలు మీద కాలు వేసుకుని గంటలు తరబడి కూర్చోవడానికి, రక్తపోటు పెరగడానికి కూడా సంబంధం ఉన్నట్టు కొన్ని పరిశోధనలు చెప్పాయి. 


కాలు పై కాలు వేసుకుని కూర్చునే స్థితిని క్రాస్ లెగ్ అంటారు. దాదాపు ఆరు అధ్యయనాలు ఇలా కూర్చుంటే ఏం జరుగుతుంది? అనే అంశంపై జరిగాయి. ఇస్తాంబుల్ లో ఈ పరిశోధన చాలా పెద్ద ఎత్తున జరిగింది. చాలా మందిని కాలు మీద కాలు వేసుకుని కూర్చొమని చెప్పారు పరిశోధకులు. ఓ గంట గడిచాక చూస్తే వారందరిలో కూడా రక్తపోటు పెరిగింది. వారికి సాధారణంగా కూర్చోమని చెప్పారు. అలా కూర్చున్న మూడు నిమిషాల తరువాత మళ్లీ రక్తపోటు చెక్ చేశారు. సాధారణ స్థాయికి వచ్చేసింది. దీంతో క్రాస్ లెగ్ వేసుకుని కూర్చోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందని తేలింది.  అయితే అది తాత్కాలికమే అని తేలింది. 


ఎందుకలా?
ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఎందుకు రక్తపోటు పెరుగుతుందో తెలుసుకోవడానికి పయత్నించారు అధ్యయనకర్తలు. అందులో వారికి రెండు రకాల కారణాలు కనిపించాయి. ఒక మోకాలిపై మరొక మోకాలు ఉంచి కూర్చున్నప్పుడు కాళ్ల నుంచి రక్తం ఛాతీ భాగానికి వేగంగా ప్రవహిస్తుంది. అప్పుడు గుండె భాగంలో అధికంగా రక్తం ప్రవహిస్తుంది. దీని వల్ల రక్త పోటు అధికమయ్యే అవకాశం ఉంది. అలాగే  గంటల తరబడి కాళ్లు కదలకుండా ఉంచడం వల్ల సిరలలో రక్తప్రసరణ వేగం తగ్గుతుంది. దాని వల్ల కూడా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. 


రోజులో కదలకుండా గంటలు గంటలు కూర్చోవడం ఏ భంగిమలోనైనా కూర్చోవడం మంచిది కాదు. గంటకోసారైనా ఇటూ అటూ నడుస్తూ ఉండాలి. ఇలా గంటల తరబడి క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుంటే మాత్రం ముందుకు వంగిపోయి నడవడం, భుజాలు ముందుకు వంగడం వంటివి జరిగే అవకాశం ఉంది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also Read: మొక్కలతో మాంసం తయారీ, రుచిగా ఉంటుందా? వేటితో తయారుచేస్తారు?


Also Read: మీ మెనూలో స్టార్ ఫ్రూట్‌ను చేర్చుకోవాల్సిందే, క్యాన్సర్ నుంచి నిద్రలేమి వరకు ఎన్నింటినో అడ్డుకుంటుంది