అంకాపూర్ చికెన్ కర్రీ ఎంత ఫేమసో చెప్పక్కర్లేదు. హైదరాబాద్ వాళ్లు కూడా ఆర్టీసీ బస్సుల ద్వారా పార్శిళ్ళు తెప్పించుకుని మరీ తింటారు. శని ఆదివారాలు వచ్చాయంటే పార్సిళ్ల సంఖ్య మరీ పెరిగిపోతుంది. కరోనా వల్ల అమ్మకాలు ఆ మధ్య తగ్గాయి కానీ, మళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అంకాపూర్ గ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలో ఉంది. అక్కడ తొలిసారి 1980లలో రామాగౌడ్ అనే వ్యక్తి ఈ కూరను వండడంతో దానికి అంకాపూర్ చికెన్‌గా స్థిరపడింది. దీని రుచికి ఎవరైనా దాసోహమైపోవాల్సిందే. అంకాపూర్ వచ్చి అందరూ తినలేరు. అలాగే పార్సిల్ సదుపాయం కూడా అన్ని ప్రాంతాలకు ఉండదు. అంకాపూర్ తయారీని ఇక్కడ ఇచ్చాం. ఇంట్లో మీరు కూడా ప్రయత్నించి చూడండి. 


కావాల్సిన పదార్థాలు
చికెన్ (నాటుకోడి) - కిలో
ఉల్లిపాయలు - రెండు
దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులు
ధనియాల పొడి - ఒక స్పూను
కరివేపాకు - గుప్పెడు
పసుపు - అర స్పూను
దంచిన ఎండు కొబ్బరి పొడి - రెండు స్పూనులు  
పల్లీ నూనె - తగినంత
దంచిన మసాలా దినుసుల పొడి - ఒక టీస్పూను
మెంతి కట్ట - ఒకటి
బిర్యానీ ఆకులు - రెండు


తయారీ విధానం ఇలా...
1. అంకాపూర్ చికెన్ కర్రీ రుచి చూడాలంటే నాటుకోడి మాంసాన్నే ఉపయోగించాలి. నాటుకోడికి పసుపు రాసి మంటపై కాల్చాలి. 
2. కోడిని మరీ చిన్నముక్కలు కాకుండా మీడియం ముక్కలుగా చేసుకోవాలి. లెగ్ పీస్‌లు మాత్రం అలాగే వదిలేసుకోవాలి. 
3. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ముక్కలన్నీ వేసి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కూరకి సరిపడినంత నూనె వేయాలి. వేడెక్కాక రెండు బిర్యానీ ఆకులు వేయాలి.  
5. తరువాత తరిగిన ఉల్లిపాయల ముక్కలు, మెంతాకు, కరివేపాకు వేసి బాగా కలపాలి. 
6. ఉల్లిముక్కలు కాస్త బంగారు వర్ణంలోకి వేగాక మారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసి బాగా కలపాలి. 
7. నీళ్లు పోసి పైన మూత పెట్టాలి. ఆ మూత కాస్త లోతుగా ఉండేలా చూసుకోవాలి. ఆ మూతలో కూడా అరగ్లాసు నీళ్లు పోసి పెట్టాలి. ఆ నీళ్లు వేడెక్కుతాయి.
8. చికెన్ సగం ఉడికాక మూతపై వేడెక్కిన నీళ్లను కూడా కూరలో వేయాలి. చల్లని నీళ్లను వేయద్దు. 
9. ఓ పదినిమిషాలు ఉడికాక కొబ్బరితురుము పొడి, ఒక టీస్పూను మసాలా వేసి బాగా కలపాలి. 
10. కూర బాగా ఉడికాక పైన కొత్తిమీర చల్లితే కర్రీ వండడం పూర్తయినట్టే. వండుతున్నప్పుడే మీకు మంచి వాసనతో నోరూరిపోతుంది. 


Also read: మీ మెనూలో స్టార్ ఫ్రూట్‌ను చేర్చుకోవాల్సిందే, క్యాన్సర్ నుంచి నిద్రలేమి వరకు ఎన్నింటినో అడ్డుకుంటుంది


Also read: మొక్కలతో మాంసం తయారీ, రుచిగా ఉంటుందా? వేటితో తయారుచేస్తారు?