శ్రీ పంచమి  రోజే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు. ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాకకోసం నేలనంతా పసుపుతో అలికాయా అనట్టుగా ఉంటుంది వాతవరణమంతా. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం.  అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంతపంచమి రోజు బాసరలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. 


Also Read: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….
బాసర క్షేత్రం ఈనాటిది కాదు
బ్రహ్మాండ పురాణంలో సైతం ఈ స్థల మహత్యం ప్రస్తావనకు వస్తుంది. అందులో ప్రముఖంగా వినిపించే కథ వ్యాసుడిది. కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చలించిపోయిన వ్యాసులవారు ప్రశాంతంగా తపస్సుని ఆచరించేందుకు గోదావరీ తీరంలో మధ్య భాగమైన బాసరకు చేరుకున్నారట. ఇక్కడి గోదావరిలో స్నానమాచరిస్తుండగా వ్యాసులవారికి సరస్వతి సాక్షాత్కరించి ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించమని చెప్పిందట. అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసుల వారు రోజూ పిడికెడు మట్టిని తీసుకుని నిదానంగా ఓ విగ్రహాన్ని రూపొందించారు. అదే ఇప్పుడు కనిపించే మూలవిరాట్టు అని  చెబుతారు.  ఆ మూలవిరాట్టుకి నిత్యం పసుపు రాస్తూ సరికొత్త రూపుని భక్తులు దర్శించుకునేలా చేస్తున్నారు పూజారులు.  అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇలా ముగ్గురమ్మలూ ఓ చోట కొలువై ఉండటం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆలయంలోని విగ్రహం వ్యాసుల వారి చేతిలో రూపొందింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసర అన్న పేరు ఉండేది...అలా అలా రూపాంతరం చెందుతూ వ్యాసర కాస్తా బాసరగా మారింది. అంత మహిమగల క్షేత్రంలో వ్యాసుడు ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించిన వసంతపంచమి రోజున  పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం కనుక చేస్తే, వారి విద్యకు ఢోకా ఉండదని నమ్మకం. 
 
Also Read:  అప్పులు, అనారోగ్యం, శత్రుబాధలు తొలగించే సూర్యారాధన ...రథసప్తమి ప్రత్యేకత ఇదే..
సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కానీ సరస్వతీ దేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది. తత్వ విచారానికీ, పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలం మీద ఆశీనులై ఉంటుంది. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ  ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆమెకు తొలిపూజలందిస్తారు. బాసరలో కేవలం అమ్మవారి ఆలయమే కాదు చాలా ఆధ్మాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. దత్త మందిరం, వ్యాసమందిరం, వ్యాసులవారి గుహలను  దర్శించుకోవచ్చు. ఇక గోదావరి నదిలో స్నానమాచరించిన తరువాత అక్కడే ఉన్న ప్రాచీన మహేశ్వర ఆలయం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయం సమీపంలోనే ఉన్న వేదవతి శిల మరో విశేషం. ఈ శిలను తడితే వేర్వేరు చోట్ల వేర్వేరు శబ్దాలు వస్తాయట. లోపల సీతమ్మవారి నగలు ఉండటం వల్ల ఇలాంటి శబ్దాలు వస్తాయని ఓ కథనం. సీతమ్మవారిని వేదవతి అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ శిలకు వేదవతి శిల అన్న పేరు వచ్చింది.


Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
ఉత్తరాదిన కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్ లో సరస్వతి విగ్రహానికి మూడురోజులు పూజలు చేసి ఆఖరు రోజు గోదావరి నదిలో అనుపుతారు.  పంజాబ్,బిహార్ రాష్ట్రాలలో దీనిని పంతంగుల పండుగగా జరుపుకుంటారు. మనం ఇక్కడ సంక్రాంతి పండగకి ఎలాగైతే గాలిపటాలని ఎగురవేస్తామో అక్కడ ఈ శ్రీ పంచమికి అన్ని వయసులవారు గాలిపటాలు  ఎగరేస్తారు. అమ్మవారికి కేసరి ప్రసాదం పెట్టటం ఇంకో విశేషం.  ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాదిన. అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించటమే కాకుండా అందరు పసుపు రంగు బట్టలే కట్టుకుంటారట. ఇంకొన్ని ప్రాంతాల్లో వసంత పంచమినే కామదేవ పంచమి అని కూడా అంటారు. రతి దేవి, కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట. అందుకే దేశం లోని కొన్ని ప్రాంతాల వారు ఈ పంచమి రోజు రంగులు జల్లుకుంటారు కూడా.