Bahurupa Ganapati Dhyana Slokas Lyrics and meaning 


శ్రీ బాల గణపతి ధ్యానం
కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్|
బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్||  


బాల గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి... కుడి వైపు చేతుల్లో అరటిపండు, పనసతొన..ఎడమవైపు వైపున్న చేతుల్లో మామిడిపండు, చెరకుగడ కనిపిస్తుంది. చురుకైన బుద్ధికోసం ఈ గణపయ్యని పూజించాలి.


శ్రీ తరుణ గణపతి ధ్యానం
పాశాంకుశాపూపకపిద్థజంబూ స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః|
ధత్తే సదా యస్తరుణారుణాభః పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః||  


తరుణ గణపతి రూపానికి ఎనిమిది చేతులుంటాయి. కుడివైపు చేతులలో పాశం, దంతం, చెరకు, వెలగగుజ్జు... ఎడమవైపున్న చేతుల్లో అంకుశం, నేరేడుపండు, వరివెన్ను...అభయముద్రతో అనుగ్రహిస్తాడు. ఈ గణనాథుడిని పూజిస్తే అన్నపానీయాలకు లోటుండదు 


శ్రీ భక్త గణపతి ధ్యానం
నాలికేరామ్రకదలీగుడపాయసధారిణమ్|
శరచ్చంద్రాభవపుషం భజే భక్తగణాధిపమ్||  


భక్త గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడివైపు  చెతుల్లో కొబ్బరికాయ, అరటిపండు... ఎడమ వైపు  చేతుల్లో మామిడి పండు, పరమాన్నం ఉంటాయి. ఈ గణపయ్యని పూజిస్తే భక్తిభావం పెరుగుతుంది. 


Also Read: ఏక సాలగ్రామ శిలపై చెక్కిన గణనాథుడు.. త్రిమూర్తులు ప్రతిష్టించిన విగ్రహం ఇది!
 
శ్రీ వీరగణపతి ధ్యానం
బేతాలశక్తిశరకార్ముకచక్రఖడ్గ ఖట్వాంగముద్గరగదాంకుశనాగపాశాన్ |
శూలం చ కుంతపరశుధ్వజముద్ద్వహంతం వీరం గణేశమరుణం సతతం స్మరామి||  


వీర గణపతి రూపానికి 16 చేతులుంటాయి.  బాణం, చక్రం, మంచంకోడు, గద, పాము, శూలం,  బేతాలుడు, గొడ్డలి బొమ్మ ఉన్న జెండా , శక్తి అనే ఆయుధం, విల్లు, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, ఖడ్గం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి అనుగ్రహిస్తారు. ఈ గణపతిని పూజిస్తే ధైర్యం పెరుగుతుంది. 
 
శ్రీ శక్తిగణపతి ధ్యానం
ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం పరస్పరాశ్లిష్టకటి ప్రదేశమ్ |
సంధ్యారుణం పాశసృణీ వహంతం భయాపహం శక్తిగణేశమీడే|| 


శక్తి గణపతి రూపానికి 4 చేతులుంటాయి. ఈ చేతుల్లో  అంకుశం, పాశం, విరిగిన దంతం, అభయహస్తంతో దర్శమనిస్తాడు గణనాథుడు.  శక్తి గణపతి అనుగ్రహం ఉంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.


Also Read: ఈ ఆలయంలో తప్పుడు ప్రమాణం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు!


శ్రీ ద్విజగణపతి ధ్యానం
యం పుస్తకాక్ష గుణదండకమండలు శ్రీ విద్యోతమానకరభూషణమిందువర్ణమ్ |
స్తంబేరమాననచతుష్టయశోభమానం త్వాం యః స్మరేద్ద్విజగణాధిపతే స ధన్యః||  


ఈ రూపానికి నాలుగు చేతులుంటాయి...పుస్తకం, దండం, అక్షమాల, కమండలం తో అనుగ్రహించే ద్విజగణపతిని పూజిస్తే తెలివితేటలు పెరుగుతాయి. 


శ్రీ సిద్ధగణపతి ధ్యానం 
పక్వచూతఫలపుష్పమంజరీ ఇక్షుదండతిలమోదకైస్సహ |
ఉద్వహన్ పరశుమస్తు తే నమః శ్రీ సమృద్ధియుత హేమపింగళః|| 


ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో పరాజయం ఉండదు.  శ్రీ సిద్ధగణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి. మామిడిపండు, పూలగుత్తి, గొడ్డలితో కనిపిస్తాడు గణపయ్య.
 
శ్రీ ఉచ్ఛిష్టగణపతి ధ్యానం
నీలాబ్జదాడిమీవీణాశాలీ గుంజాక్ష సూత్రకమ్ |
దధదుచ్ఛిష్టనా మాయం గణేశః పాతుమేచకః ||
ప్రకాంతరేణ సారీయోనిరసాస్వాదలోలుపం కామమోహితమ్ || 


ఉచ్ఛిష్టగణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి..నల్ల కలువ, వరివెన్ను, దానిమ్మపండు, జపమాలతో భక్తులను అనుగ్రహిస్తాడు. 
 
శ్రీ విఘ్నగణపతి ధ్యానం
శంఖేక్షుచాపకుసుమేషుకుఠారపాశ చక్రస్వదంతసృణిమంజరి కాశరౌఘైః |
పాణిశ్రితైః పరిసమీహితభూషణ శ్రీర్విఘ్నేశ్వరో విజయతే తపనీయగౌరః || 


విఘ్నగణపతి రూపానికి 10 చేతులుంటాయి.  ఆ చేతులలో శంఖం, విల్లు, గొడ్డలి,చక్రం,పూలగుత్తి, చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణం పట్టుకుని దర్శనమిస్తాడు.


Also Read: ఈ 8 ఆలయాలను రెండు రోజుల్లో చుట్టేయవచ్చు.. వినాయకచవితికి ప్లాన్ చేసుకోండి!
 
శ్రీ క్షిప్రగణపతి ధ్యానం
దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |
బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ || 


ఈ  రూపానికి 4 చేతులుంటాయి. దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ, కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి వినాయకుడు దర్శమనిస్తాడు. 
 
శ్రీ హేరంబగణపతి ధ్యానం
అభయవరదహస్తః పాశదంతాక్షమాలా సృణిపరశుదధానో ముద్గరం మోదకం చ |
ఫలమధిగతసింహః పంచమాతంగవక్త్రో గణపతి రతిగౌరః పాతు హేరంబనామా || 


 హేరంబగణపతి రూపానికి 10 చేతులుంటాయి. కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం, వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి   అభయముద్రనిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. ప్రయాణాల్లో ఉండే ఆపదలు తొలగించే గణపతి రూపం ఇది. 
 
శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం
బిభ్రాణః శుకబీజపూరకమిలన్మాణిక్యకుంభాకుశాన్ 
పాశం కల్పలతాం చ ఖడ్గవిలసజ్జ్యోతిస్సుధానిర్ఝరః |
శ్యామే నాత్తసరోరుహేణ సహితం దేవీద్వయం చాంతికే 
గౌరాంగో వరదానహస్తసహితో లక్ష్మీగణేశోఽవతాత్|| 


లక్ష్మీగణపతి రూపానికి 10  చేతులుంటాయి. వరదముద్ర, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం, దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపించే ఈ గణపతిని పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. 


Also Read: గణేష్ చతుర్థి 2024: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!
 
శ్రీ మహాగణపతి ధ్యానం
హస్త్రీంద్రాననమిందుచూడమరుణచ్ఛాయం త్రినేత్రం 
రసాదాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్ |
బీజాపూరగదేక్షుకార్ముకలసచ్ఛక్రాబ్జపాశోత్పల 
వ్రీహ్యగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే || 


మహాగణపతి రూపానికి 10 చేతులుంటాయి. ఆ చేతుల్లో మొక్కజొన్న, విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం, గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశంతో కనిపించే ఈ గణపతిని సేవిస్తే సకల శుభాలు కలుగుతాయి. 
 
శ్రీ విజయగణపతి ధ్యానం
పాశాంకుశస్వదంతామ్రఫలవానాఖువాహనః | 
విఘ్నం నిహంతు నస్సర్వం రక్తవర్ణో వినాయకః || 


నాలుగు చేతులున్న విజయగణపతి రూపాన్ని పూజిస్తే చేపట్టిన పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ నాలుగు చేతుల్లో  పాశం, విరిగిన దంతం , అంకుశం, పండిన మామిడి పండుతో దర్శనమిస్తాడు.
  
శ్రీ నృత్తగణపతి ధ్యానం
పాశాంకుశాపూపకుఠారదంత చంచత్కరాక్లుప్తవరాంగులీకమ్ |
పీతప్రభం కల్పతరోరధస్థం భజామి నృత్తోపపదం గణేశమ్ ||


నాలుగు చేతులతో దర్శనమిచ్చే నృత్తగణపతిని ధ్యానిస్తే  జీవితంలో సంతృప్తిని, మనశ్శాంతినీ ప్రసాదిస్తాడు.  పాశం, అప్పాలు, అంకుశం,  విరిగిన దంతంతో ఈ గణపయ్య దర్శనమిస్తాడు. 
 
ఊర్ధ్వ గణపతి
కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ 
ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యాదేవ్యాకరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః || 


ఊర్థ్వ గణపతి ని పూజిస్తే కారాగాల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఎనిమిది చేతులతో దర్శనమిచ్చే ఈ వినాయకుడి చేతుల్లో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం,  వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి భక్తులను అనుగ్రహిస్తాడు.