31th August 2024 School News Headlines Today:


నేటి ప్రత్యేకత


  • భారత 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వర్థంతి

  • హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి

  • ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసే జయంతి

  • బ్రిటన్ ప్రిన్సెస్ డయానా వర్ధంతి


ఆంధ్రప్రదేశ్ వార్తలు: 


  • కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో బాలికల వసతిగృహంలో రహస్య కెమెరాలు ఏర్పాటుచేసి వీడియోలు తీశారన్న సమాచారం  తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక సాంకేతిక బృందంతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆరోపణలు వచ్చిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

  • గుడ్లవల్లేరు బాలికల హాస్టల్‌లో రహస్య కెమెరాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. దీనిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ.. విచారణకు ఆదేశించారు. దీనిపై జేఎన్‌టీయూఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదని సీఎం స్పష్టం చేశారు.


తెలంగాణ వార్తలు: 


  • తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల డిజైన్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిజైన్లను పరిశీలించి కీలక మార్పులను అధికారులకు సూచించారు. త్వరగా డిజైన్లు పూర్తి చేసి ఇవ్వాలని ఆదేశించారు. యువతకు అవసరమైన, నాణ్యమైన స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • తెలంగాణలోని జూనియ‌ర్ కాలేజీల్లో ప్రవేశాల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు మ‌రోసారి గ‌డువు పొడిగించింది. సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్రవేశాల‌కు గ‌డువు పొడిగించిన‌ట్లు బోర్డు వెల్లడించింది. ఇంట‌ర్‌లో ప్రవేశం కోసం టెన్త్‌ మెమో, ఆధార్ కార్డు త‌ప్పనిస‌రిగా ద‌ర‌ఖాస్తుకు జ‌త‌ప‌ర‌చాలి.

  • నవోదయలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఆధార్, ఫోటో, విద్యార్థి సంతకం, తల్లి/తండ్రి సంతకం, నవోదయ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసి పూర్తి చేసిన దరఖాస్తు ఇవ్వాలి. దరఖాస్తులు ఇవ్వడానికి సెప్టెంబర్, 19 ఆఖరి తేదీ. జనవరి 18, 2025 సంవత్సరంలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.  


జాతీయ వార్తలు :


  • మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. విగ్రహం కూలడం వల్ల తీవ్ర వేదనకు గురైన వారికి తలవంచి క్షమాపణలు తెలియజేస్తున్నానని మోదీ తెలిపారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో వేదనకు గురయ్యారని మోదీ అన్నారు.

  • భారత్‌లో మరోసారి కొవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది. అమెరికా, దక్షిణ కొరియాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అమెరికాలోని 25 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని పేర్కొంది. 85 దేశాల్లో మరోసారి కరోనా వ్యాప్తి చెందుతోంది. 


అంతర్జాతీయ వార్తలు: 


  • బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్టార్‌లైనర్‌లో లీకులు ఏర్పడటంతో ఆమె అక్కడే చిక్కుకుపోయారు. మరో ఆరు నెలలపాటు ఆమె అంతరిక్షంలోనే ఉండవచ్చని నాసా ప్రకటించింది. 

  • టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్‌గా భార‌త సంత‌తికి చెందిన కెవాన్ ఫ‌రేక్‌ నియ‌మితులయ్యారు. ప్రస్తుత సీఎఫ్ఓ లూకా మాస్త్రి ప‌ద‌వీకాలం 2025 జ‌న‌వ‌రి 1తో ముగియ‌నుంది. ఆయ‌న స్థానంలో కెవాన్ బాధ్యత‌లు తీసుకుంటారు.


Read Also: Paris Paralympics 2024: ఒకే రోజు నాలుగు పతకాలు, పారాలింపిక్స్‌లో భారత్‌ సత్తా


క్రీడా వార్తలు: 


  • పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఒకే రోజు నాలుగు పతకాలు కొల్లగొట్టి చరిత్ర సృష్టించారు. అవని లేఖరా  10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. షూటర్‌ మనీష్‌  10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో 234.9 స్కోరుతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అవనీ లేఖరా పసిడి గెలిచిన విభాగంలోనే మోనా కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్‌ కాంస్యంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. 


Read Also: Paris 2024 Paralympics: 100 మీటర్ల పరుగులో మనకు ఓ పతకం, కష్టాల పరుగులో పసిడి సంబరాలు


 

మంచిమాట

కొవ్వొత్తిలా కరిగిపోతూ వెలుగులు పంచేవాడు గురువు