ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సోకే క్యాన్సర్ గా చెప్పవచ్చు. ఇతర క్యాన్సర్లకంటే ఎక్కువగా మరణాలకు కారణమవుతోంది. మన దేశంలో నమోదయ్యే మొత్తం క్యాన్సర్ కేసుల్లో 6 శాతం ఉంటుంది. క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న మరణాల్లో 8 శాతం వరకు కారణమవుతోంది. దీనికి ప్రధాన కారణం పొగతాగే అలవాటుగా చెబుతారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లలో 80 శాతం మంది పొగతాగే అలవాటున్నవారే కావడం గమనార్హం.


95 శాతానికి పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ను బాగా ముదిరిన తర్వాతే గుర్తిస్తారు. గుర్తించే నాటికే క్యాన్సర్ ఇతర బాగాలకు వ్యాపించిన దశలో గుర్తిస్తున్నారట. అందువల్ల ఈ క్యాన్సర్ పేషెంట్లలో మరణాలు ఎక్కువ. ఇందుకు కారణం ఈ క్యాన్సర్ లక్షణాలు చాలా అస్పష్టంగా ఉంటాయి. పెద్దగా లక్షణాలు కనిపించవని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోయినప్పటికీ కొన్ని సాధారణ సంకేతాలు వ్యాధిని సూచిస్తాయి. అలాంటి కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం. 


ఎడతెరపి లేని దగ్గు


చాలా వారాలుగా దగ్గు వేధిస్తూ ఉంటే ముఖ్యంగా పొగతాగే వారి తగ్గు మాదిరిగా కాకుండా అందుకు కాస్త భిన్నంగా కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా అనుమానించాల్సిందే. క్యాన్సర్ వల్ల శ్వాస నాళాల్లో ఇబ్బంది కలుగుతుంది. ఒక్కోసారి కణితి కూడా ఏర్పడి ఉండవచ్చు. అందువల్ల వాయు ప్రసరణకు అంతరాయం ఏర్పడడం వల్ల దగ్గు వస్తుంది. ఈ దగ్గు మూడు వారాలకు మించి కొనసాగితే మాత్రం తప్పకుండా డాక్టర్ ను సంప్రదించడం అవసరం. దీర్ఘకాలికంగా దగ్గు వేధిస్తుంటే అది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కావచ్చు.


కఫంలో రక్తం


దగ్గినపుడు వచ్చే కఫంలో కొద్దిపాటి రక్తం కనిపించడం లేదా కఫం తప్పు రంగులో జేగురుగా కనిపించడం కూడా ప్రమాదసూచికగా భావించాలి. శ్వాసనాళాల్లో రక్తస్రావం వల్ల ఇలా కఫం రంగు మారుతుంది. దీనిని హెమాప్టిసిస్ అంటారు. ఇది వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలనేందుకు సూచన. ఎందుకంటే ఇది కేవలం క్యాన్సర్ వల్ల మాత్రమే కాదు బ్రాంకైటిస్, క్షయ, పల్మనరీ ఎంబోలిజం వంటి ప్రమాదకర పరిస్థితులకు కూడా సూచన కావచ్చు.


ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది


ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, గురక రావడం వంటి లక్షణాలు క్యాన్సర్ వల్ల కావచ్చు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఇలా జరగవచ్చు.


ఛాతిలో నొప్పి


ఛాతిలో అసౌకర్యం లేదా నొప్పి, దగ్గినపుడు లేదా నవ్వినపుడు శ్వాస లో ఇబ్బంది ఏర్పడడం ఊపరితిత్తుల్లో చుట్టూ ఆవరించి ఉన్న ఛాతి భాగం ప్లూరా లైనింగ్ లో కణితి ఏర్పడితే ఇలా జరగవచ్చు. చిన్నగా ఛాతినొప్పి నిరంతరంగా ఉంటుంది. ఒక్కోసారి ఒక భాగంలో స్థిరపడుతుంది. ఇది పక్కటెముకల్లో క్యాన్సర్ వల్ల కావచ్చు.


స్వరంలో అకస్మాత్తుగా మార్పు రావడం, ఎలాంటి కారణం, ప్రయత్నం లేకుండా బరువు తగ్గడం, తరచుగా గొంతు ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు వేటిని కూడా నిర్లక్ష్యం చెయ్యడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  చిన్న చిన్న మార్పులైనా సరే స్పష్టంగా కనిపిస్తున్నపుడు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరం.