స్త్రీలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో అట్లతద్ది ఒకటి. ‘తదియ’నే ‘తద్ది’అంటారు. ఆశ్వయుజ బహుళ తదియరోజు వచ్చే ఈ రోజునే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఈ రోజున ఆడపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు పెట్టుకుంటారు. వేకువ జామునే లేచి అన్నం తింటారు. పప్పు, పులుసు, పచ్చడి, కూర, పెరుగు వేసుకుని అన్నం తింటారు. దీన్నే ఉట్టికింద ముద్ద అంటారు. అట్లతద్దోయ్ ఆరట్లోయ్ , ముద్ద పప్పోయ్ మూడట్లోయ్ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. 11 తాంబూలాలు వేసుకుంటారు, 11 ఉయ్యాలలూగుతారు, 11 రకాల ఫలాలు తింటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీ దేవికి, చంద్రుడికి పూజ చేసి 11 అట్లు చొప్పున నైవేద్యం పెట్టి...మరో పది అట్లు ముత్తైదువుకు వాయనం ఇస్తారు. పదేళ్లు ఈ వ్రతాన్ని ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చెప్పుకుంటే స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.
అట్లతద్ది అంతరార్థం
త్రిలోక సంచారి అయిన నారదముని సూచన మేరకు ఈశ్వరుడిని పతిగా పొందేందుకు గౌరీదేవి మొదటిసారిగా చేసిన వ్రతమే అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రుడి కళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహంతో స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయని శాస్త్రవచనం.
అట్లెందుకు నైవేద్యం పెడతారు
ఈ పండుగలో అమ్మవారికి, చంద్రుడికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలోనూ సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి వేస్తారు కాబట్టి... మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. అందుకే అట్లను వాయనం ఇవ్వడం ద్వారా గర్భ దోషాలు తొలగిపోతాయంటారు. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని విశ్వాసం.
అట్ల తద్ది కథ
అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు , మంత్రి కూతురు , సేనాపతి కూతురు , పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా ఉండేవారు. అట్లతద్ది రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత పూజ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ లోగా రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. చెల్లెలి అవస్థ చూసి తల్లడిల్లిపోయిన రాకుమారులు అద్దంలో ఓ తెల్లని వస్తువు చూపించి చంద్రోదయం అయింది కొంచెం తినేశాక పూజ చేసుకో అని చెప్పారు. అన్నల మాట విశ్వసించిన ఆమె తినేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి ఆనలుగురు స్నేహితురాళ్లకు పెళ్లైంది. మంత్రి,సేనాపతి, పురోహితుని కూతుర్లకు వయసుకి తగ్గా భర్తలు రాగా... రాకుమార్తె కు మాత్రం ముసలి భర్త దొరికాడు. వ్రతం చేసినా తనకు మాత్రం ఎందుకిలా జరిగిందని ఆమె బాధపడగా..అప్పుడు మిగిలిన వారంతా జరిగిన విషయం చెప్పారు. ఆ మర్నాడే ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు 'చంద్రోదయ ఉమా వ్రతం' (అట్ల తద్ది) చేస్తే సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన కూడా శాపవిమోచనం పొందినట్టు ఆమెకు తగ్గా భర్తలా మారాడు. అందుకే కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే ఉత్తముడైన భర్త లభిస్తాడని, వివాహితులు చేస్తే సౌభాగ్యంతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి.
పూజ, చంద్ర దర్శనం అయ్యాక దండనాలు
రెండు గుప్పిళ్లలోకి బియ్యం తీసుకుని పీటపై కానీ, ఓ ప్లేట్ లో కానీ మూడుసార్లు పోస్తారు. ఏడమ చేతిపై కుడిచేయి వచ్చేలా ఆపోజిట్ లో పెట్టి గుప్పిట్లో ఉన్న బియ్యాన్ని ఈ మాటలు చెబుతూ వదలాలి.
తల్లిదండనా..తండ్రి దండనా కలిగి ఉండాలి
అత్త దండనా...మామ దండనా కలిగి ఉండాలి
పురుషుడి దండనా..పుత్రుడి దండనా కలిగి ఉండాలి
సర్గానికి వెళ్లినా సవతి పోరు వద్దు
మేడమీదకు వెళ్లినా మారడు తల్లి వద్దు
యమ దండనా..రాచ దండనా ఎన్నటికీ వద్దు
( ఇలా ఒక్కో మాట చెబుతూ బియ్యం వదులుతూ...మూడు సార్లు చెప్పాలి. అవే బియ్యాన్ని మరొకరు కూడా వినియోగించవచ్చు.)
అట్లతద్ది వెనుక శాస్త్రీయ దృక్పథం
ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో ఆడిపాడితే ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం.
Also Read: తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి?
Also Read: ఇదింతే అనే ఆలోచన మార్చుకోకుంటే ఏమవుద్ది.. వచ్చే సమస్యలేంటి? కేరీర్ గ్రోత్‌కి దీనికి లింకేంటి
Also Read: ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…యోగశాస్త్రం ఏం చెబుతోంది….పురాణాలు ఏం చెబుతున్నాయి..
Also Read: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Atla Tadde 2021: స్త్రీలు ఈ నోము నోచుకుంటే వివాహితులకు సౌభాగ్యం … అవివాహితులకు మంచి భర్త లభిస్తాడట..
ABP Desam
Updated at:
22 Oct 2021 09:20 AM (IST)
Edited By: RamaLakshmibai
పెళ్లికాని ఆడపిల్లలు తమకు సలక్షణమైన భర్త రావాలని, వివాహితులు తమ కాపురం చక్కగా సాగాలని కోరుకుంటూ చేసే నోమే అట్లతద్ది. నారద మహర్షి సూచన మేరకు శివుడి కోసం మొదటి సారిగా గౌరీదేవి ఆచరించిన నోము ఇది.
Atla Tadde 2021
NEXT
PREV
Published at:
22 Oct 2021 09:17 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -