నిద్రలో కలలు కనడం మానవ సహజం. కేవలం మనుషులే మాత్రమే కాదు…ప్రతి పక్షి, ప్రతి జంతువూ, ప్రతి ప్రాణి కలలు కనడం అతిసాధారణం. సింహ స్వప్నం అనే మాట అలా పుట్టినదే అని చెబుతారు. ఏనుగు కలలో కూడా సింహానికి భయపడుతుందని అంటారు. పురాణాల్లోనూ కలలకు సంబంధించిన కథలున్నాయి. రామాయణంలో.. సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒక రోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరిచి, లంకాదహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత అది జరిగింది కూడా. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది. అష్టాదశ పురాణాల్లో ఒకటైన అగ్ని పురాణం ఏడవ అధ్యాయంలో కలలు వాటి ఫలితాలను వివరించారు. సీతాదేవి , లక్ష్మణుడు తమకు వచ్చిన చెడు కలలను తలుచుకుని , చుట్టుపక్కల సంకేతాలతో అనుసంధానం చేసుకుని ఆందోళనకు గురవ్వుతారు. అది గమించిన శ్రీరామ చంద్రుడు సీత, లక్ష్మణుడికి కలలు, వాటి ఫలితాల గురించి వివరించినట్టు చెబుతారు.
నిద్రను 4 సమాన భాగాలుగా విభజించినట్లయితే:
❤ మొదటి భాగంలో వచ్చిన కలలు ఏడాది తర్వాత చెడు ఫలితాలనిస్తాయి.
❤ రెండవ భాగంలో వచ్చిన కలలు 6-12 నెలల్లో ఫలితాన్నిస్తాయి.
❤ మూడవ భాగంలో వచ్చిన కలలు 3-6 నెలల్లో ఫలితాన్నిస్తాయి.
❤ నాల్గవ భాగంలో వచ్చిన కలలు 1-3 నెలల్లో ఫలితాన్ని ఇస్తాయి.
❤ ఏదైనా కల సూర్యోదయం తర్వాత లేదా మేల్కొనే ముందు వచ్చినట్టైతే దాని ఫలితాన్ని సుమారు 10-15 రోజుల్లో ఉంటుందని అర్థం.
కలలు-వాటి ఫలితాలు:
❤ ఎవరైనా తనను తాను/ నృత్యం చేయడం, పాడటం, సంగీతం వినడం లేదా సంతోషకరమైన మానసిక స్థితిలో ఉత్సాహంగా ఉండటం చూసినట్లయితే, అది శుభసూచకం. ఇది త్వరలో మీ ఆత్మ సహచరుడితో సమావేశాన్ని సూచిస్తుంది.
❤ చెరువులో నీళ్లు తాగే జంట పశువులు కలలో కనిపిస్తే సంతోషకరమైన వైవాహిక జీవితానికి సూచన.
❤ తనను తాను ఒక తోటలో ఆత్మీయుడితో కలిసి నడుస్తున్నట్లు కలొస్తే వారు తమకు నచ్చిన భాగస్వామిని పొందుతారనేందుకు సంకేతం.
❤ కుటుంబ జీవితం విజయవంతంగా సాగుతుందని సూచన. అమ్మాయి తనను తాను ఆభరణాలు ధరించినట్లు కలకంటే ఉన్నత స్థాయి వ్యక్తిలో వివాహం జరుగుతుంది.
❤ తనను తాను కంకణాలు ధరించడాన్ని చూస్తే ఆమెకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది.
❤ పండు తినడం లేదా పండ్ల రసం తాగడం కనిపిస్తే వైవాహిక సంబంధాల్లో చీలిక వచ్చే అవకాశం.
❤ ఎలుగుబంటి కలలో కనిపిస్తే ప్రేమ వ్యవహారం లేదా వైవాహిక జీవితంలో మూడవ వ్యక్తి జోక్యం ఉంటుంది.
చెడుకలలు: నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకున్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు. పాములను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలు, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా కనిపించడం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం మంచిది కాదని చెబుతారు. . నదిలో మునిగి కిందికి పోవటం, బురద నీళ్ళతో స్నానం చేయటం శుభ శకునాలు కాదు. స్వలింగ సంపర్కం, అనారోగ్యానికి గురైనట్టు, ఇళ్ళను పడదోసినట్టు కలలో కనిపించటం శుభప్రదాలు కాదని అగ్నిపురాణం చెబుతోంది.
మంచి కలలు: చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దెబ్బలు తింటున్నట్లు కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. కాళ్లు, చేతులు కడుగుతున్నట్లు కల వస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. పాము కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయి. పెద్దలు దీవిస్తున్నట్లు, పాలు, నీళ్లు తాగుతున్నట్టు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కలలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట. పెళ్లి అయినట్లు కలవస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. కలలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారని అర్థం. రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. కాలుజారి పడినట్లు కల వస్తే మీకు అష్టకష్టాలు ఎదురవుతాయట. కలలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం ఉంటుంది. గుర్రం ఎక్కినట్లు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుంది. మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలు పోతాయని చెబుతారు.
కలల గురించి సైన్స్ ఏం చెబుతోంది?:
కలలు కనటానికి - ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (REM) అనే నిద్రావస్థతో ప్రధానంగా ముడిపడి ఉంది. ఈ నిద్రావస్థలో కొన్నిసార్లు మనం మేల్కొని ఉన్నట్లే ఉంటుంది. కళ్లు వేగంగా కదులుతాయి. శ్వాస తీసుకోవటం, రక్తప్రసరణలో మార్పులు జరుగుతాయి. శరీరం అటోనియా అనే అచేతనావస్థలోకి వెళుతుంది. నిద్రపోయేటపుడు 90 నిమిషాల తరంగాల్లో ఇది జరుగుతుంది. ఈ దశలోనే మన మస్తిష్కాలు కలలు కంటుంటాయి. ఈ REM స్థితిలో మన మెదడులోని కీలక ప్రాంతాలకు రక్త ప్రవాహం అధికంగా ఉంటుంది. మన కలలను తన కంటెంట్‌తో నింపేది కోర్టెక్స్. మన భావోద్వేగ స్థితిని పర్యవేక్షించేది లింబిక్ సిస్టమ్. ఈ రెండు ప్రాంతాలకూ రెమ్ నిద్రావస్థలో మామూలు కన్నా అధిక రక్త ప్రసరణ జరుగుతుంది. ''మనం మెలకువలో ఉన్నప్పటి విషయాలు గుర్తున్నట్లు గానే కలలకు సంబంధించి అన్ని వివరాలూ గుర్తున్నట్లయితే, మన నిజ జీవితంలో వాస్తవంగా ఏం జరుగుతోందనే గందరగోళంలో పడిపోతాం" అంటారు సైకాలజీ నిపుణలు.
నిద్ర 4 దశల్లో REM పనితీరు ఎలా ఉంటుందంటే..:
❤ REM స్టేజ్ 1: వేగవంతమైన కంటి కదలిక అంటే REM దశ 1- మీరు నిద్రపోగానే ఈ దశ ప్రారంభమవుతుంది. ఈ దశ సుమారు 20 నిమిషాలు ఉంటుంది.
❤ REM స్టేజ్ 2: ఈ దశలో నిద్ర వ్యవధి మొత్తం రాత్రి నిద్రలో 50% ఉంటుంది. ఈ స్థితిలో, మెదడు నెమ్మదిగా డెల్టా తరంగాలను విడుదల చేస్తుంది
❤ REM స్టేజ్ 3: ఈ దశను ‘గాఢ నిద్ర’ అంటారు. శరీరం పునరుద్ధరణకు ఇది చాలా ముఖ్యమైన దశ
❤ REM స్టేజ్ 4: ఈ దశలో వేగవంతమైన కంటి కదలిక ( REM)ఉంటుంది. ఈ స్థితిలో, దాదాపు అన్ని కండరాలు సడలుతాయి. శ్వాస సక్రమంగా ఉండదు. కలలు రావడం మొదలవుతాయి. ఇది రాత్రి మొత్తంపై అతి ముఖ్యమైన నిద్ర. నాలుగోదశ నిద్ర ఎంత ఎక్కువ ఉంటే అంత ఆరోగ్యం అని నిపుణులు చెబుతారు.
వాస్తవానికి రోజంతా మన ఆలోచనలు, తీరని కోర్కెలు, అంతర్లీనంగా ఉండే ఆలోచనలే కలలు అని కూడా చెబుతారు మానసిక శాస్త్రవేత్తలు.