Jogulamba Temple Alampur:  అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ లో జోగులాంబగా భక్తులను అనుగ్రహిస్తోంది అమ్మవారు. కాశీ నగరానికి వరుణ, అసి అనే నదులున్నట్టే అలంపురానికి కూడా ఇటు వేదవతి - నాగావళి నదులున్నాయి. అందుకే ఈ నగరాన్ని దక్షిణ కాశి అని కూడా అంటారు. పూర్వం ఈ ఆలయం శిథిలమైపోగా మళ్లీ విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టించారు. 


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


స్థల పురాణం


తండ్రి దక్షుడు యజ్ఞం చేపట్టాడని తెలిసి పిలుపు రాకపోయినా వెళుతుంది సతీదేవి. అక్కడ అవమానాలు ఎదుర్కొని అగ్నిగుండంలో పడి ప్రాణత్యాగం చేసుకుంటుంది. సతీదేవిపై ప్రేమతో శివుడు ఆ దేహాన్ని భుజాన ధరించి లోకంమొత్తం తిరుగుతుంటాడు. ఇక శివుడిని మళ్లీ తన కార్యంలోకి దించేందుకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుచేస్తాడు. అమ్మవారి శరీరం ముక్కలుగా పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలు. అందులో భాగంగా దంతాలు పడిన ప్రదేశమే అలంపూర్. ఇక్కడ అమ్మవారు తేజోవంతంగా దర్శనమిస్తుంది. గాల్లో తేలే కేశాలు...వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని..ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని...ఆ తర్వాత దశలో గబ్బిలాలు చేరుతాయని చెప్పడమే అమ్మవారి రూపం వెనుకున్న ఆంతర్యం.   ఇంట్లో జరిగే శుభాశుభాలకు జోగులాంబ ప్రతిరూపం అని..అందుకే అమ్మను గృహచండిగా పిలుస్తారు. 


నిర్మాణ శైలి అత్యద్భుతం


అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మంచి అనుభూతి మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను ఆకట్టుకుంటుంది.  క్రీ.శ.6వ శతాబ్దంలో చాళుక్యరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. గోపురాలు, వాటిపై శిల్పకళ సహా మొత్తం ఆలయ నిర్మాణం అప్పటి నిర్మాణశైలికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. 14 వ శతాబ్ధంలో దాడుల కారణంగా  అమ్మవారి ఆలయం దెబ్బతిన్నా..ఆ తర్వాత మళ్లీ కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్టించారు.


Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!


నిత్యం ఆధ్యాత్మిక శోభ


అలంపూర్ జోగులాంబ ఆలయం నిత్యం ప్రత్యేకపూజలు, భక్తుల రద్దీతో కళకళలాడుతుంటుంది. మంగళ వారం, శుక్రవారం ఆలయం మరింత ప్రత్యేకం. సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు సహా ఎలాంటి కష్టాన్నైనా తీర్చే తల్లిగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తోంది.  కార్తీకమాసం, శివరాత్రి, శరన్నవరాత్రులు ఈ ఆలయంలో చాలా ప్రత్యేకం.  సువర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. జోగులాంబ  ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి అక్కడకు తరలించారు.  బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు. ఇప్పుడు నేరుగా దర్శించుకుంటున్నారు.


నవబ్రహ్మ ఆలయం ప్రత్యేకం


అలంపూర్ లో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబదేవాలయంతో పాటూ నవబ్రహ్మ ఆలయం కూడా ఉంది. ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవుడికి ఉన్న ఆలయాల సంఖ్య చాలాతక్కువ. రాజస్థాన్ లోని పుష్కర్ లో బ్రహ్మకు ఆలయం ఉంది..ఆ తర్వాత తెలంగాణలో అలంపూర్ లో కూడా బ్రహ్మకు దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మ 9 రూపాల్లో దర్శనమిస్తాడు. బాలబ్రహ్మేశ్వర, విశ్వబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్థబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, వీరబ్రహ్మ పేర్లతో దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్జానం, సంపద కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో శిల్పకళపై అధ్యయనం చేసేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ శాసననాల పై   అధ్యయనం జరుగుతూనే ఉంటుంది.