Subramanya Swamy Temple: సహజంగా ఎక్కడైనా వివాహితుడైన వల్లీ దేవసేన సమేతుడయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉండటం పరిపాటి. అయితే అవివాహితుడయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తూ ఉండటంతో బిక్కవోలు గ్రామానికి ప్రత్యేకత సంతరించుకుంది. తమిళనాడు పళనలో వేంచేసి ఉన్న స్వామి వారు... ఆ తరువాత  బిక్కవోలులు కొలువైన  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భారత దేశంలో రెండో కుమార క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది. పదకొండు వందల  ఏళ్ల చరిత్ర కలిగిన బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానం లేని స్త్రీలకు సంతాన ప్రాప్తినిచ్చే స్వామి వారిగా ప్రసిద్ధి గాంచారు. 


పంచారామాల కంటే 300 ఏళ్ల ముందే తూర్పు చాళుక్యులచే నిర్మించబడిన బిక్కవోలులోని ప్రసిద్ధి చెందిన ప్రాచీన గోలింగేశ్వరాలయంగా ప్రసిద్ది చెందింది. శైవ కుటుంబం మొత్తం కొలువై ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ దేవాలయానికి ఎడమ వైపు రాజరాజేశ్వరుని ఆలయం, కుడివైపు చంద్రశేఖర స్వామి వారి ఆలయం ఉంటాయి. ఈ నెల 29వ తేదీన జరిగే సుబ్బారాయుడి షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇదే దేవాలయంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పై ప్రత్యేక కథనాన్ని ఏబీపీ దేశం మీకోసం అందిస్తోంది. 
తూర్పు గోదావరి జిల్లా  అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉండటం చేత స్వామి వారికి ఇష్టమైన మంగళ వారం, శుద్ధ షష్టి, కృత్తికా నక్షత్రం రోజులలో సుబ్రహ్మణ్యేశ్వ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో స్వామి దగ్గర ఉన్న సర్పానికి పూజలు చేయడం  ఇక్కడి ప్రత్యేకత. స్వామి వారికి ఇష్టమైన పర్వ దినాల్లో రాహు, కేతు, కుజ సర్ప దోషాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. సంతానం లేని స్త్రీలు షష్టి సందర్బంగా  స్వామి చెంతనే ఉన్న సహజ పుట్టపై నాగుల చీర ఉంచి దానిని ధరించి ఆలయ ఆవరణలో నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.


అత్యంత ఘనంగా షష్టి ఉత్సవం...


బిక్కవోలు సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకుని భారీ స్థాయిలో తీర్థ మహోత్సవం నిర్వహిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలి వస్తుంటారు. సృష్టి మహోత్సవంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రాచీన గోలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పూజలు చేయడం ద్వారా సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తులు నమ్మకం. అందుకే ఇక్కడికి ఎక్కువగా సంతాన లేమి సమస్యతో బాధపడే వాళ్లు వస్తుంటారు. భక్తి, శ్రద్ధలతో స్వామి వారిని పూజించి మొక్కులు చెల్లించుకుంటారు. 


భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ....


ఈ నెల 28వ తేదీ నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు కన్నుల పండువగా జరిగే  సుబ్బారాయుడి  షష్టి ఉత్సవ ఏర్పాట్లతో బిక్కవోలు గ్రామం షష్టి శోభ సంతరించుకుంది. కుమార సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలోని గోలింగేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవాలయాల గోపురాలు, ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేవాలయం ముందు పెద్ద పందిరి వేసి చూపరులను ఆకట్టుకునే విధంగా భిన్న రంగుల వస్త్రాలతో సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. గ్రామంలోని పెద్ద వంతెన నుండి దేవాలయం వరకు ప్రధాన రహదారులకు ఇరు వైపులా విద్యుత్ దీపాలంకరణతో పాటు ప్రధాన కూడళ్లలో చూపరులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ దీపాలతో భారీ దేవతా ప్రతిమలు ఏర్పాటు చేశారు. 


నవంబర్ 29వ తేదీన జరగనున్న షష్టికి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు. దర్శన సమయంలో భక్తులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు బారికేడ్లు నిర్మించారు. అదే రోజు షష్టి కళా వేదికపై ప్రసిద్ధి గాంచిన వివిధ బ్యాండ్ కచేరీలు, రాత్రికి అత్యంత వైభవంగా స్వామివారి గ్రామోత్సవం, స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో బాణాసంచా ప్రదర్శనా పోటీలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఉత్సవాలు జరిగే రోజుల్లో ప్రసిద్ధ కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని షష్టి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, అనపర్తి వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు జేవీవీ. సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ఆకెళ్ల రామ భాస్కర్, షష్టి ఉత్సవ కమిటీ ప్రతినిధి తమ్మిరెడ్డి నాగశ్రీనివాస రెడ్డిలు తెలిపారు.