Telangana New Secretariat : తెలంగాణ కొత్త  సమీకృత కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 2023, జనవరి 18వ తేదీన కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు పనులు పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బి అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థను సిఎం ఆదేశించారు. కొ త్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా 6వ అంతస్తులోని సిఎం బ్లాకు ప్రారంభించడంతో పాటు తన ఛాంబర్‌లో కెసిఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు. మూడు షిఫ్టుల్లో ప నులు వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారుల ను, వర్క్ ఏజెన్సీలకు ప్రభుత్వం నిర్దేశించిది.  డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహన్ని కూడా ఆలోపే పెట్టనున్నారు.  మంత్రులు, అయా శాఖల ముఖ్య కార్యదర్శుల చాంబర్లు, సెక్షన్‌ కార్యాలయాలు కూడా శరవేగంగా సిద్ధమవుతున్నాయి. వైరింగ్‌, ఫర్నిచర్‌ ఏర్పాటు దాదాపు పూర్తి కావొచ్చింది.  


సంక్రాంతి నుంచి కొత్త భవనంలో పాలన 
 
సంక్రాంతి నుంచి తెలంగాణ పాలనా కేంద్రం కొత్త కొత్త భవనంలోకి మారుతుంది.  పార్లమెంట్‌ ఆవరణలో ఉన్నట్లుగానే తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో కూడా రెండు భారీ ఫౌంటెయిన్లను నిర్మిస్తున్నారు. సెక్రటేరియట్‌ ముందు ఏర్పాటు చేస్తున్న ఈ ఫౌంటెయిన్లు సచివాలయానికి మరింత వన్నె తెస్తాయి. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అనేక విశేషాలున్నాయి.   కొత్త సెక్రటేరియట్‌ భవనానికి ప్రధాన ఆకర్షణగా ఉండనున్న భారీ గుమ్మటాలను ఇటీవలే ఏర్పాటు చేశారు.  సచివాలయ భవనం డిజైన్‌ ప్రకారం.. మధ్యలో ఖాళీ ప్రదేశం ఉండగా.. తూర్పు, పశ్చిమ భాగాల్లో భవనంపై గుమ్మటాలు ఉంటాయి. ఇవి ఒక్కోటీ 82 అడుగుల ఎత్తు ఉంటాయి.  


కొత్త సెక్రటేరియట్‌కు ఎన్నో  విశేషాలు
 
హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండతోపాటు కుతుబ్‌షాహీ టూంబ్స్, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు భవనం గుర్తుకొస్తాయి. వీటన్నింటిలోనూ డోమ్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కుతుబ్‌షాహీలు, అసఫ్‌ జాహీల జమానాలోని కట్టడాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆధునిక కాలంలో ఇలాంటి నిర్మాణాలు అరుదు. అయితే కాకతీయ–పర్షియా నిర్మాణ శైలులను మేళవించి డిజైన్‌ చేసిన కొత్త సచివాలయ భవనంపై గుమ్మటాలు కనువిందు చేయనున్నాయి. రెండు భారీ గుమ్మటాలు సహా మొత్తం 34 గుమ్మటాలను కొత్త సచివాలయంలో నిర్మించారు. 


ఆకర్షణీయంగా ఉండనున్న కొత్త  సెక్రటేరియట్ 
 
కొత్త సచివాలయ భవనం మొత్తం ధవళ వర్ణంలో మెరిసిపోనుంది. పాత భవనం స్పురించేలా మొత్తం తెలుపు రంగు వేయాలన్న ఆర్కిటెక్ట్‌ సూచనను ప్రభుత్వం ఆమోదించింది. పైభాగంలో ఉండే రెండు ప్రధాన గుమ్మటాలు సహా మొత్తం 34 డోమ్స్‌ కూడా తెలుపు రంగులోనే ఉండనున్నాయి. పెద్ద డోమ్‌కు ఏవైనా మరమ్మతులు అవసరమైతే సిబ్బంది పైభాగం వరకు వెళ్లేలా మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. 45 అడుగుల ఎత్తు వరకు బయటి నుంచి మెట్లు నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి లోనికి వెళ్లి, డోమ్‌ పైభాగానికి చేరుకునేలా ద్వారం, క్యాట్‌ వాక్‌ స్టెయిర్స్‌ ఏర్పాటు చేశారు. కొత్త సచివాలయం దేశంలోని అన్ని రాష్ట్రాల సచివాలయలతో పోలిస్తే ప్రత్యేకంగా ఉండనుంది.